Russia: రష్యాను ‘ఉగ్రవాద ప్రోత్సాహక దేశం’గా ప్రకటించిన ఈయూ పార్లమెంట్‌

పౌరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న దాడులను ఈయూ పార్లమెంట్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానంపై మెజారిటీ సభ్యులు  ఓటింగ్ ద్వారా తమ మద్దతు తెలిపారు.

Published : 24 Nov 2022 02:10 IST

బ్రసెల్స్‌: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్‌ పార్లమెంట్‌ మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌర స్థావరాలే లక్ష్యంగా విద్యుత్‌, ఆసుపత్రులు, పాఠశాలలపై పుతిన్‌ సైన్యం దాడులు చేస్తోందని ఆరోపించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఈయూ పార్లమెంట్‌ (EU Parliament) స్పష్టం చేసింది. ఇలా ఉక్రెయిన్‌పై దారుణాలకు పాల్పడుతోన్న రష్యాను (Russia) ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి ఓటింగ్‌ నిర్వహించగా.. 494 సభ్యులు మద్దతు పలికారు. మరో 58మంది వ్యతిరేకించగా.. మరో 44 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. తమ పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందంటూ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని అమెరికాతోపాటు ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా విదేశాంగ మాత్రం ఇందుకు నిరాకరిస్తూ వస్తోంది. ఇప్పటివరకు కేవలం క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్‌, సిరియా దేశాలను మాత్రమే అమెరికా ఈ జాబితాలో చేర్చింది. ఒకవేళ ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటిస్తే.. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధంతోపాటు ఆర్థికంగానూ ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే రష్యాపై ఈయూ దేశాలు పలురకాల ఆంక్షలు విధించగా.. తాజాగా ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని