EUలో ఇకపై టైప్‌-సి పోర్ట్‌ మాత్రమే.. యాపిల్‌పై ఎఫెక్ట్‌!

మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా ఏ డివైజ్‌కైనా యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉండే ఛార్జర్‌ మాత్రమే ఉండాలని యూరోపియన్‌ పార్లమెంట్‌ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.

Updated : 21 Dec 2022 16:41 IST

బ్రస్సెల్స్: మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా ఏ డివైజ్‌కైనా యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉండే ఛార్జర్‌ మాత్రమే ఉండాలని యూరోపియన్‌ పార్లమెంట్‌ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. 2024 నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల్లోనూ ఈ విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన బిల్లుకు 602 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా.. 13 మంది వ్యతిరేకించారు. ఈ-వేస్ట్‌ను తగ్గించడం, వినియోగదారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ యాపిల్‌పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.

యూరోపియన్‌ దేశాల్లో కామన్‌ ఛార్జర్‌ విధానంపై ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొత్త డివైజ్‌ కొన్న ప్రతిసారీ ఒక్కో తరహా ఛార్జర్‌ వినియోగించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు ఒక డివైజ్‌ నుంచి వేరే డివైజ్‌కు మారాల్సినప్పుడు రెండు వేర్వేరు ఛార్జర్లు వినియోగించాల్సి ఉంటోంది. ఇది వినియోగదారుడికి భారమే కాకుండా ఇ-వేస్ట్‌ సైతం పెరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా కామన్‌ ఛార్జర్‌పై చట్టం తీసుకొచ్చింది. ఇకపై మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కెమెరాలు, ఇ-రీడర్‌లు, ఇయర్‌ బడ్స్‌ ఇతర చిన్న తరహా డివైజ్‌లను తయారుచేసే కంపెనీలన్నీ టైప్‌-సి ఛార్జర్‌ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈయూ పార్లమెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పోటీ కంపెనీలతో పోలిస్తే యాపిల్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ఆ కంపెనీ ప్రస్తుతం తమ స్మార్ట్‌ఫోన్లకు లైటెనింగ్‌ పోర్ట్‌ను వినియోగిస్తోంది. తొలుత ఈ నిర్ణయాన్ని యాపిల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు లైటినింగ్‌ పోర్ట్‌ స్థానే టైప్‌-సి పోర్ట్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇ-వేస్ట్‌ తగ్గించేందుకు భారత్‌లోనూ ఈ తరహా ప్రయత్నం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని