Switzerland : ఐరోపాలోనే ఎత్తయిన రైల్వేస్టేషన్‌.. అండర్‌గ్రౌండ్‌లో..!

పర్యాటకానికి పెట్టింది పేరు స్విట్జర్లాండ్‌ (Switzerland). అక్కడి అద్భుత నిర్మాణ ప్రదేశాల్లో ‘జంగ్‌ఫ్రాజోచ్‌’ రైల్వేస్టేషన్‌ (Railway station) ఒకటి. ప్రపంచం (World) నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు (Tourist) పోటెత్తుంటారు. అందమైన మంచు పర్వతాలను సందర్శిస్తూ పరవశించి పోతుంటారు.

Published : 04 Apr 2023 15:15 IST

(Image : Social media)

స్విట్జర్లాండ్‌లో (Switzerland) సుందరమైన ఆల్ప్స్ పర్వతాలపై (Alps mountain) 11332 అడుగుల ఎత్తులో ‘జంగ్‌ఫ్రాజోచ్‌’ రైల్వేస్టేషన్‌ (Jungfraujoch railway) ఉంది. ఇది ఐరోపాలోనే (Europe) ఎత్తయిన రైల్వేస్టేషన్‌గా అధికారిక గుర్తింపు పొందింది.. ఒక దశాబ్దం కిందట మానవులు సృష్టించిన ఇంజినీరింగ్‌ అద్భుతం ఈ రైల్వేస్టేషన్‌. జంగ్‌ఫ్రా, మోంచ్‌ పర్వతాల రాళ్లను తొలిచి దీన్ని నిర్మించారు. ఆ రెండు పర్వతాల ఎత్తు దాదాపు 4వేల మీటర్లు. 

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..

1862లో తొలిసారి ఓ వ్యక్తి జంగ్‌ఫ్రాజోచ్‌ను చేరుకున్నాడట. ఆ తరువాత ఆంగ్లో-స్విస్‌ బృందం ఒకటి ఆ పర్వతాన్ని అధిరోహించింది. అప్పట్లో అదో చారిత్రాత్మక విజయంగా నమోదైంది. ఆ సంఘటన జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత జంగ్‌ఫ్రాజోచ్ రైల్వేస్టేషన్‌ నిర్మాణం కోసం స్విస్‌ వ్యాపారవేత్త అడాల్ఫ్‌ గుయెర్‌ జెల్లర్ ఒక ప్రణాళికను తయారు చేశాడు. దాని గురించి తెలిసి తొలుత అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా నిర్మాణానికి స్థానిక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ ప్రాజెక్టు 16ఏళ్లపాటు కొనసాగింది. వందలాది మంది కార్మికులు ఆల్ప్స్‌ పర్వతాల్లో నిరంతరాయంగా పనిచేశారు. ఈ క్రమంలో అనేక చోట్ల కొండలను తొలిచారు. మరి కొన్ని చోట్ల సొరంగ మార్గాలు నిర్మించడానికి డైనమైట్లు పేల్చారు. దాంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మాణం మొత్తం పూర్తయ్యేలోపు అధికారికంగానే 30 మంది మరణించారు.

(Image : Social media)

స్వర్గ మార్గంలా ప్రయాణం!

జంగ్‌ఫ్రాజోచ్‌’ రైల్వేస్టేషన్‌ ప్లాన్‌ను తొలుత పేపర్‌పై గీసినప్పుడు అది విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా 1912 కల్లా ఆ రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి అది నిరంతరాయంగా పనిచేస్తోంది. తొలినాళ్లలో పర్వతారోహకులు కష్టపడినట్లు ఇప్పుడు ఎవరూ సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. రైలు ఎక్కితే అనేక మనోహర దృశ్యాలను చూస్తూ 30 నిమిషాల్లోనే ఆ స్టేషన్‌కు చేరుకోవచ్చు. రైలు క్లైన్‌ స్కీడెగ్‌ వద్ద ప్రారంభమవుతుంది. ఆ ప్రదేశం సముద్ర మట్టానికి 2060 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి 9.3 కిలోమీటర్లు ప్రయాణిస్తే 3454 మీటర్ల ఎత్తులో.. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న ‘జంగ్‌ఫ్రాజోచ్‌’ రైల్వేస్టేషన్‌ తారసపడుతుంది. ఒక బహిరంగ ప్రదేశంలో రైలు మొదలై.. వందేళ్ల క్రితం కొండలను పగులగొట్టి నిర్మించిన సొరంగ మార్గం గుండా అది వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. కొన్ని సొరంగాల వద్ద పనోరమిక్‌ కిటీకీలున్నాయి. వాటి నుంచి ప్రకృతిని చూస్తే ఆల్ప్స్‌ పర్వతశ్రేణులు ఒక స్వర్గంలా కనిపిస్తాయి.

టికెట్‌ ఖరీదు ఎంతంటే..!

ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన రైల్వేస్టేషన్‌ను చేరుకోవడానికి ఖర్చు కూడా ఎక్కువే. ఒక్కో టికెట్ ఖరీదు 245 డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఆ మొత్తం రూ.20వేలు. అయినా ఖర్చుకు వెనుకాడకుండా పర్యాటకులు ఈ స్టేషన్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వాతావరణం నిమిషాల వ్యవధిలోనే మారుతుందట. అన్ని ప్రదేశాలు స్పష్టంగా కనిపించేలా ఆ రోజు ఉందంటే వారు నిజంగా అదృష్టవంతులేనట. స్టేషన్‌ పైకి ఎక్కి ఎటు వైపు చూసినా దాదాపు 200 పర్వతాలు కనిపిస్తాయని సమాచారం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు