WHO: గాయాలు, హింస కారణంగా నిత్యం 12వేల మంది మృతి..!

వివిధ రకాల ప్రమాదాల్లో గాయాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 12వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయొచ్చని ప్రపంచ దేశాలకు సూచించింది.

Published : 01 Dec 2022 01:20 IST

జెనీవా: వివిధ ప్రమాద ఘటనల్లో గాయాలు, హింస కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 12వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ముఖ్యంగా 5 నుంచి 29ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో చనిపోతున్నవారు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడటం, హత్య, ఆత్మహత్యలు వంటి మూడు ప్రధాన కారణాలతోనే ప్రాణాలు విడుస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు నీటిలో కొట్టుకుపోవడం, కాలిన గాయాలు, విషప్రయోగం వంటి మరిన్ని కారణాలతో చనిపోతున్నారని పేర్కొంది. ‘గాయాల నియంత్రణ, సురక్షిత చర్యలు’ పై ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 14వ అంతర్జాతీయ సదస్సులో విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూహెచ్‌ఓ  ఈ వివరాలు తెలిపింది.

కేవలం వివిధ కారణాలతో గాయాలై ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 44లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. వీటిలో ప్రతి మూడు కేసుల్లో ఒకటి రోడ్డు ప్రమాదాల గాయాలతో మరణిస్తుండగా.. ప్రతి ఆరు కేసుల్లో ఒకటి ఆత్మహత్య ఉన్నట్లు తెలిపింది. ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి హత్య కాగా, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల చనిపోతున్నట్లు వెల్లడించింది.

వీటి పర్యవసానాలు సంపన్నులతో పోలిస్తే పేద కుటుంబాలపైనే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమోమ్‌ ఘెబ్రియేసస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన అసమానతలను నిర్మూలించడంలో ఆరోగ్యరంగానిది కీలక పాత్ర అన్నారు. వేగ నియంత్రణ చర్యలు, ఈత శిక్షణ, లైంగిక దాడులపై మైనర్లకు అవగాహనపై పలు దేశాలు చేపడుతోన్న చర్యలను ఉదహరించిన ఆయన.. ఇటువంటి జాగ్రత్తల వల్ల ప్రమాదాలను సాధ్యమైంతవరకు తగ్గించవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని