Imran Khan: నాకు సాయం చేయండి: ఇమ్రాన్‌ ఆడియో లీక్‌..!

నిత్యం అమెరికాను నిందించే ఇమ్రాన్‌ ఇప్పుడు రూటు మార్చారు. తనను కాపాడేందుకు అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు గళం విప్పాలని కోరారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ లీకైంది.

Published : 21 May 2023 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని పదవిని కోల్పోయిన నాటి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan) తరచూ అమెరికా(USA) ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది. కానీ, ఇప్పుడు తనను ప్రభుత్వం జైల్లో పెడుతుందేమోనన్న భయంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలినే ఇమ్రాన్‌ సాయం అడిగారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి వైరల్‌గా మారిందని పాక్‌లో జియోటీవీ కథనం ప్రసారం చేసింది. అమెరికాలో ప్రతినిధుల సభలో కాలిఫోర్నియాకు  ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్సినె మూర్‌ వాటర్స్‌తో ఇమ్రాన్‌ ఖాన్‌ టెలిఫోన్‌లో చర్చించారు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికాలోని చట్టసభలో గళం విప్పాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌లోని పరిస్థితిని ఆమెకు వివరించినట్లు ఈ క్లిప్‌లో ఉంది. దీంతోపాటు తనకు అనుకూలంగా ఓ ప్రకటన కూడా విడుదల చేయాలని మాక్సినె మూర్‌ను ఆయన కోరారు. 

‘‘ఇటీవల నాపై జరిగిన హత్యాయత్నంలో మూడు తూటాలు తాకాయి. నా ప్రభుత్వాన్ని మాజీ ఆర్మీచీఫ్‌ కూల్చేశారు. ఇక్కడ సైన్యం చాలా శక్తిమంతమైంది. నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పుడు అధికారంలో ఉన్నవారితో కలిసి కుట్ర పన్నారు. ఇక్కడి సమస్య తెలిసేట్లు ఒక ప్రకటన మాత్రమే కోరుకుంటున్నాం. అది మాకు నిజంగా సహాయకారిగా ఉంటుంది. మీలాంటి వారు ఎవరైనా స్పందిస్తే అది చాలా సంచలనం సృష్టిస్తుంది’’ అని ఇమ్రాన్‌ఖాన్‌ తన గోడును మాక్సినె వద్ద వెళ్లగక్కారు.

మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశంలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్మీకి  చెందిన భవనాలు, కార్యాలయాలపై ఇమ్రాన్‌ మద్దతుదారులు దాడికి దిగారు. దీనిని ఆర్మీ(Pak Army) సీరియస్‌గా తీసుకుంది. అమరవీరుల స్మారకాలను అగౌరవపరిచే చర్యలను ఏ మాత్రం అనుమతించమని వార్నింగ్ ఇచ్చింది. అయితే దేశంలో వివిధ ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతోపాటు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ అన్నారు. ఇమ్రాన్‌కు న్యాయస్థానాల్లో తాత్కాలికంగా ఊరట లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు