USA: రంగంలోకి పెన్స్‌.. ట్రంప్‌తో పోటీకి సై..!

రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ట్రంప్‌నకు షాక్‌ ఎదురైంది. ఆయన వద్ద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన పెన్స్‌ కూడా ఇప్పుడు అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. 

Published : 08 Jun 2023 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఊహించని వైపు నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున రంగంలోకి దిగాలని భావిస్తున్న ట్రంప్‌ను ఆయన సన్నిహితుడు, మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ సవాలు చేస్తున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల కోసం పెన్స్‌ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ట్రంప్‌ను విమర్శిస్తూనే ప్రచారాన్ని ప్రారంభించారు. 2021లో ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్స్‌ భవనంపై చేసిన దాడిని తీవ్రంగా విమర్శించారు.

ఐయోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్స్‌ మాట్లాడుతూ ‘‘ఎవరైనా రాజ్యాంగం కంటే తాము అధికులమని భావిస్తే.. వారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వకూడదు. అంతేకాదు.. తమను రాజ్యాంగం కన్నా అధికులుగా చూడాలని కోరిన వారిని కూడా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకోకూడదు’’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి దీంతో పోటీ మొదలైనట్లయింది.

వాస్తవానికి పెన్స్‌ వ్యాఖ్యలు ట్రంప్‌ ఏమాత్రం జీర్ణించుకోలేనివిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్‌ను విమర్శించడానికి పెన్స్‌ దూరంగా ఉన్నారు. దీనికి తోడు చాలా మంది రిపబ్లికన్‌ ఆశావహులు కూడా ‘జనవరి 6 నాటి ఘటన’ను ప్రస్తావంచేందుకు వెనుకాడారు. ట్రంప్‌ శ్వేతసౌధంలో ఉన్నంతకాలం ఆయన చర్యలను, వివాదాలను సమర్థించుకొంటూ వచ్చిన పెన్స్‌.. ఇప్పుడు ధైర్యంగా దానిపై మాట్లాడటం గమనార్హం. ఆ ఘటనను రాజకీయ విషపూరితమైన, భయంకర చర్యగా పెన్స్‌ చూశారు. దీంతోపాటు ట్రంప్‌ వ్యతిరేకులను ఆకర్షించేందుకు పెన్స్‌ వ్యాఖ్యాలు బాగా ఉపయోగపడతాయనే అంచనాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని