Veto At UN: ‘వీటో’ తీరుపై మండిపడ్డ భారత్‌.. స్వార్థ ప్రయోజనాలకే ఆ దేశాల వినియోగం

ఐరాస భద్రతా మండలిలో (UN Security Council) కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనా దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి మాత్రమే వీటో అధికారం (Veto Power) ఉంది.

Published : 27 Apr 2023 15:09 IST

ఐరాస: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UN Security Council) వీటో వినియోగం కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలోనే జరుగుతున్నాయని.. నైతిక బాధ్యతతో కాదని భారత్‌ ఉద్ఘాటించింది. దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధంగా కేవలం ఐదు శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే వీటో అధికారం (Veto Power) కట్టబెట్టారని మండిపడింది. ‘వీటో ఇనిషియేటివ్‌’ తీర్మానానికి ఏడాదైన సందర్భంగా ‘యూజ్‌ ఆఫ్‌ వీటో’పై ఐరాస సాధారణ సభలో జరిగిన ప్లీనరీలో భారత్‌ తన గళాన్ని మరోసారి వినిపించింది. ఐరాసలో భారత కౌన్సిలర్‌ ప్రతీక్‌ మథూర్‌ ఈ విషయంపై ప్రసంగించారు.

‘రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటో కార్యకలాపాలు జరుగుతాయి. అంతేకానీ నైతిక బాధ్యతతో కాదు. గత 75 ఏళ్లుగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం శాశ్వత సభ్యదేశాలు వాటిని వాడుకుంటున్నాయి. ఇదే తీరు కొనసాగినంత కాలం సభ్య దేశం/దేశాలు.. వీటోను అలాగే వినియోగించుకుంటాయి. ఇటీవల చూస్తున్న మాదిరిగానే నైతిక బాధ్యతను పక్కనపెట్టి అలాగే వ్యవహరిస్తాయి’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ఐరాస ప్రతీక్‌ మథూర్‌ (Pratik Mathur) స్పష్టం చేశారు.

గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (Russia Invasion) మొదలుపెట్టన తర్వాత భద్రతా మండలిలో ఓ తీర్మానానికి సంబంధించి రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. ఈ క్రమంలోనే గత ఏప్రిల్‌లో ‘వీటో ఇనిషియేటివ్‌’పై ఐరాస సాధారణ సభ ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. విస్తృతస్థాయిలో సభ్యదేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కీలక నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరమని పేర్కొంది.

మరోవైపు, 15 సభ్యులు కలిగిన ఐరాస భద్రతా మండలిలో కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. శాశ్వత దేశాలు కాని జాబితాలో ఉన్న మిగతా 10 దేశాలు ప్రతి రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. వీటికి మాత్రం వీటో అధికారం లేదు. అయితే, ఐరాసలో ఎన్నో సంస్కరణలు అవసరమని కోరుతున్న భారత్‌.. 140కోట్లకు పైగా జనాభా తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు