Putin: పుతిన్‌ తలొంచే రకం కాదు..!

తన సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బాంబుల వర్షం కురిపిస్తున్నాడు.

Published : 25 Mar 2022 01:17 IST

రష్యా అధ్యక్షుడి సైకాలజీని అంచనా వేసిన నిపుణులు

మాస్కో: తన సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. రష్యా సైన్యం ఊహించినట్లుగా దూసుకెళ్లలేకపోవడంతో అసహనంతో ఉన్న అతడు తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి తెచ్చుకోవద్దని పాశ్చాత్య దేశాలను హెచ్చరిస్తున్నాడు. ఇక గతంలో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై బాంబులు కురిపించడం వంటి చర్యలకు పూనుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు. ఈ ప్రవర్తన ఆధారంగా నిపుణులు అతడి మానసిక స్థితిని అంచనా వేశారు. 

పుతిన్‌ను నియంతలైన సద్దామ్ హుస్సేన్, గడాఫీ, హిట్లర్ వంటి వారితో పోల్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుత సైనిక చర్య నేపథ్యంలో హిట్లర్‌తో పోలుస్తూ ఉక్రెయిన్‌ వాసులు మీమ్స్‌ పోస్టు చేశారు. పుతిన్‌ను ఇలా నియంతలతో పోల్చేందుకు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ‘అతడు ఆచరణాత్మకంగా, క్రూరంగా ఉంటాడని నేననుకుంటున్నాను. అతడికి ఆశయం ఉంది. అతడు 1991 ప్రచ్ఛన్న యుద్ధక్రమాన్ని మార్చి, తిరిగి రాయాలనుకుంటున్నాడు. అతడి క్రూరత్వం కొత్తదేం కాదు. అతడు బలహీనతను అసహ్యించుకుంటాడు. అందుకే అతడిని బలహీన పర్చినట్లుగా, అవమానానికి గురయ్యేట్లు చేయడం వల్ల సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది’ అని కెన్నెత్‌ డెక్లెవా అంచనా వేశారు. కెన్నెత్‌ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ రీజినల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. 

ప్రపంచంపై పుతిన్‌ దృష్టికోణం సోవియట్‌ కాలంలో రూపుదిద్దుకుందని విమర్శకులు తెలిపారు. క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, ఉక్రెయిన్‌పై దాడి ద్వారా అతడు సోవియట్‌ యూనియన్‌ను పునరుద్ధరించాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. ‘భావోద్వేగాలు కనిపించనీయని పుతిన్‌ లుక్స్‌.. అతని క్రూరత్వాన్ని చెబుతాయి. తనను ఎవరూ ప్రేమించడం లేదని, తనకు అందరూ భయపడతారని భావించే చిన్నపిల్లాడి లాంటి ప్రవర్తనను పుతిన్ వ్యక్తిత్వం గుర్తుచేస్తుంది’ అంటూ జేవియర్ ఉర్రా అన్నారు. జేవియర్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్. 

సోవియట్ యూనియన్‌ను తిరిగి నిర్మించాలన్న అతడి కోరిక పలుమార్లు బయపడిందని వారు వెల్లడిస్తున్నారు. సోవియట్ పతనాన్ని పుతిన్‌ 20వ శతాబ్దపు అతిపెద్ద భౌగోళిక రాజకీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆనాటి గందరగోళ పరిస్థితుల మధ్య తన స్థాయిని వేగంగా పెంచుకున్నాడు. రష్యా తయారు చేసిన కరోనా టీకాకు స్పుత్నిక్‌ అని పేరుపెట్టడం తన ఆశయానికి నిదర్శనంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పేరుతో 1950ల్లో సోవియట్ యూనియన్‌ శాటిలైట్ పంపింది. అలాగే 2015నాటి ప్రసంగంలో ఉక్రెయిన్‌ను రష్యా కిరీటంలో రత్నంగా పుతిన్‌ అభివర్ణించాడు. తన పదవీకాలంలోనే ఉక్రెయిన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని కోరుకున్నాడని యూఎస్ ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఫియోనా హిల్  వెల్లడించారు. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని