Japan: జపాన్‌ ప్రధానిపై దాడికి యత్నం.. బాంబు విసిరిన దుండగుడు

జపాన్‌ (Japan) ప్రధాని ఫుమియో కిషిదా (Fumio Kishida) పర్యటనలో బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోర్టులో ప్రధాని పర్యటిస్తుండగా ఓ యువకుడు స్మోక్‌ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది.

Updated : 15 Apr 2023 15:34 IST

టోక్యో: జపాన్‌ (Japan) ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. అయితే అధికారులు అప్రమత్తమై ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రధానికి ఎలాంటి హానీ జరగలేదు.

కిషిదా (Fumio Kishida) శనివారం వకయామలోని సైకాజకి పోర్ట్‌లో పర్యటించారు. మరికాసేపట్లో ప్రధాని ప్రసంగం చేయాల్సి ఉండగా.. వేదికకు సమీపంలో పేలుడు (Bomb Blast) శబ్దం వినిపించింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధాని (Fumio Kishida)ని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఘటనాస్థలం నుంచి ఓ యువకుడు పారిపోతుండగా భద్రతాసిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చాయి. ఆ యువకుడే ప్రధాని ఉన్న వేదికపైకి ‘స్మోక్‌ బాంబ్‌’ను విసిరినట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా ఎవరికైనా గాయాలు అయ్యాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

జపాన్‌ (Japan) మాజీ ప్రధాని షింజో అబే (Shinzo Abe) దారుణ హత్య జరిగిన నెలల వ్యవధిలో ప్రధానిపై ఇలా దాడికి యత్నం జరగడం గమనార్హం. 2022 జులైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కూడలి వద్ద షింజో అబే ప్రసంగిస్తుండగా దుండగుడు ఆయనపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబే.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో జపాన్‌లో జి-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ.. ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని