Video: ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురి మృతి.. 53మందికి గాయాలు

తుర్కియేలోని ఇస్తాంబుల్‌(Istanbul)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది. ఇస్తాంబుల్ నడిబొడ్డున నిత్యం జన సంచారంతో రద్దీ ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్‌ అవెన్యూలో జరిగిన భారీ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. 

Updated : 13 Nov 2022 21:21 IST

ఇస్తాంబుల్‌: తుర్కియేలోని ఇస్తాంబుల్‌(Istanbul)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది. ఇస్తాంబుల్ నడిబొడ్డున నిత్యం పర్యాటకులు, స్థానికుల సంచారంతో రద్దీ ఉండే ఇస్తిక్‌లాల్‌ అవెన్యూలో జరిగిన ‘బాంబు దాడి’ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 53మందికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.20 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి  స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు అధిక మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ అలీ యెర్లికయా వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఆరోగ్య, అగ్నిమాపక బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అయితే, మరో పేలుడు సంభవించే అవకాశం ఉండటంతో ఇస్తిక్‌లాల్‌ స్ట్రీట్‌ను పోలీసులు మూసివేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇది విద్రోహపూరిత దాడి.. శిక్ష తప్పదు: ఎర్డొగాన్‌

ఈ ఘటనపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌ స్పందించారు. ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశానికి బయల్దేరడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పేలుడు ఒక విద్రోహ పూరిత చర్యగా పేర్కొన్న ఆయన.. దోషుల్ని శిక్షిస్తామన్నారు. ఇస్తాంబుల్ గవర్నర్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 53మంది గాయపడినట్టు తెలిపారు. ఘటనా స్థలంలోనే నలుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారన్నారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు