Mocha: అతి తీవ్రంగా ‘మోచా’ తుపాను.. 5 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు!

అత్యంత తీవ్రమైన ‘మోచా’ తుపాను ధాటికి బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Published : 14 May 2023 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన ‘మోచా (Mocha)’ తుపాను బంగ్లాదేశ్‌ (Bangladesh), మయన్మార్‌ (Myanmar)లను వణికిస్తోంది. గంటకు గరిష్ఠంగా 180-190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యయుక్‌ప్యూ (మయన్మార్)ల మధ్య తుపాను (Mocha Cyclone) తీరాన్ని దాటింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ (West Bengla)లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.

మోచా.. ఐదో కేటగిరి తుపానుగా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్‌, మయన్మార్‌లు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను మూసివేశాయి. బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రోహింగ్యాలు నివసిస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం ‘కాక్స్ బజార్‌’కు తుపాను ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని హెచ్చరించారు. అంతకుముందు 2007లో వచ్చిన తుపాను ధాటికి బంగ్లాలో మూడు వేల మందికిపైగా మృతి చెందారు. బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని