China: చైనా అడ్డాలో కూలిన అమెరికా ఎఫ్‌-35..!

అమెరికాకు ఎఫ్‌-35 రహస్యాలను కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారి దాని శకలాలను సమీకరంచడం పెద్ద తతంగా మారుతోంది. నవంబర్‌లో బ్రిటన్‌కు చెందిన ‘క్వీన్‌ ఎలిజిబెత్‌’ విమాన వాహక నౌక పై నుంచి ఎఫ్‌-35బీ విమానం మధ్యదరా సముద్రంలో కూలిపోయింది. అప్పట్లో రష్యన్లు దాని శకలాల

Updated : 28 Jan 2022 16:35 IST

 మరోసారి శకలాల కోసం కంగారు..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు ఎఫ్‌-35 రహస్యాలను కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారీ దాని శకలాలను సమీకరించడం పెద్ద తతంగా మారుతోంది. నవంబర్‌లో బ్రిటన్‌కు చెందిన ‘క్వీన్‌ ఎలిజిబెత్‌’ విమాన వాహక నౌక పై నుంచి ఎఫ్‌-35 విమానం మధ్యదరా సముద్రంలో కూలిపోయింది. అప్పట్లో రష్యన్లు దాని శకలాల కోసం ప్రయత్నిస్తారేమోనని అమెరికా బెంబేలెత్తిపోయింది. చివరికి కొన్ని వారాల తర్వాత దానిని గుర్తించింది. ఈ సారి డ్రాగన్‌ అడ్డా అయిన దక్షిణ చైనా సముద్రంలో ఎఫ్‌-35 కూలిపోయింది. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌పై ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు సిబ్బంది కూడా గాయపడ్డారు. 

ఈ విమానానికి అత్యాధునిక రహస్య పరికరాలను అమర్చారు. ఈ ప్రమాదం అంతర్జాతీయ జలాల్లో జరిగింది. ప్రస్తుతం ఇది సముద్రం అడుగున పడిపోయింది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అని చైనా చెప్పుకొంటోంది. ఈ నేపథ్యంలో చైనా దళాలు చేతికి ఈ శకాలు దక్కకుండా చేసేందుకు అమెరికా శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ శకలాలను బయటకు తీసేందుకు కనీసం 10 రోజులు పట్టవచ్చు. ఆలోపు బ్లాక్‌బాక్స్‌ బ్యాటరీ అయిపోతే విమానం ఎక్కడుందో గుర్తించడం సవాలుగా మారుతుంది. 

ఎగిరే కంప్యూటర్‌..! 

ఎఫ్‌-35పూర్తిగా అత్యాధునికమైన విమానం. దీనిని నిపుణులు ఎగిరే కంప్యూటర్‌తో పోలుస్తారు. దీనిలో అమెరికా ఇతర ఆయుధాలతో అనుసంధానయ్యేలా లింకింగ్‌ నెట్‌వర్క్‌ సెన్సర్లు ఉన్నాయి. వీటి ఆధారంగా లక్ష్యాలపై ఎఫ్‌-35 దాడి చేస్తుంది. చైనా వద్ద ఆ టెక్నాలజీ లేదు. దీంతో ఈ శకలాల కోసం డ్రాగన్‌ తీవ్రంగా ప్రయత్నించడం ఖాయం. వారి చేతికి అవి దక్కతే ఎఫ్‌-35 లింకింగ్‌ నెట్‌వర్క్‌లోకి చైనా కూడా ప్రవేశించగలగుతుంది.  

* ఈ విమానం సేకరించిన సమాచారాన్ని నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ద్వారా అత్యంత కచ్చితంగా మిగిలిన వ్యవస్థలతో పంచుకొంటుంది. 

* శత్రుదేశాల గగనతలంలో కూడా ఈ విమానం అత్యంత రహస్యంగా ప్రయాణించగలదు. దీనిని శత్రువులు గుర్తించడం దాదాపు అసాధ్యం. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లపై ఉపయోగిస్తున్న తొలి స్టెల్త్‌ జెట్‌ ఇదే. 

* ఈ ప్రపంచలోనే అత్యంత శక్తిమంతమైన ఫైటర్‌జెట్‌ ఇంజిన్‌ను ఈ విమానానికి అమర్చారు. ఇది గంటకు 1,200 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది శబ్దవేగం కంటే 1.6రెట్లు ఎక్కువ. 

ప్రమాదాలకు నెలవుగా కార్ల్‌ విన్సన్‌..!

అమెరికా అణుశక్తి విమాన వాహక నౌక కార్ల్‌ విన్సన్‌పై  ఉన్న వింగ్‌-2 విభాగంపై నవంబర్‌ 22 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. 

* నవంబర్‌ 22న ఎఫ్‌ఏ 18ఈ యుద్ధవిమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అయినా సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. 

* నవంబర్‌ 24వ తేదీన ఎంహెచ్‌-60 సీహాక్‌ హెలికాప్టర్‌ అనుకోకుండా సోనార్‌కు సంబంధించిన సామగ్రిని పోగొట్టుకొంది. శిక్షణ సమయంలో ఇది జరిగింది. 

* నవంబర్‌ 29న ఎఫ్‌ఏ 18ఈ సూపర్‌ హార్నెట్‌ విమానంలో ఒక ఇంజిన్‌ మొరాయించింది. దీంతో పైలట్‌ ఆ ఇంజిన్‌ను షట్‌డౌన్‌ చేసి మరో ఇంజిన్‌తో ల్యాండ్‌ అయ్యాడు. 

* డిసెంబర్‌ 31న సీఎంవీ 22బీ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇది కార్ల్‌ విన్సన్‌ డెక్‌పైనే చోటు చేసుకొంది. 

* ఇటీవల అత్యాధునిక ఎఫ్‌-35 కూలిపోయింది. 

భయపెడుతున్న చైనా చరిత్ర..

అమెరికా ఆయుధ శకలాలను సేకరించిన చరిత్ర చైనాకు ఉంది. గతంలో ఎఫ్‌-117 అనే అత్యాధునిక అమెరికా స్టెల్త్‌ విమానం 1999లో సెర్బియాలో కూలిపోయింది. ఆ విమాన శకలాలను చైనా సంపాదించి.. తాజాగా జే-20 స్టెల్త్‌ జెట్‌ను తయారు చేసింది. ఈ అనుభవం నుంచి అమెరికా ఇంకా బయటపడలేదు.

* పాకిస్థాన్‌లోని అబౌటాబాద్‌లో బిన్‌లాడెన్‌ ఇంటిపై అమెరికా దళాలు 2011లో దాడి చేశాయి. ఈ దాడికి రెండు స్టెల్త్‌ హెలికాప్టర్లను అమెరికా వినియోగించింది. వీటిల్లో ఒకటి పొరబాటున లాడెన్‌ ఇంటి కాంపౌడ్‌లో కూలిపోయింది. ఆ తర్వాత దానిని నుంచి చైనా నిపుణులు ఆన్‌బోర్డ్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను అపహరించినట్లు నిపుణులు చెబుతున్నారు. 

* యుకే సబ్‌మెరైన్‌ హెచ్‌ఎంఎస్‌ పొసైడాన్‌ మునిగిపోగా.. 2009లో చైనా దాని శకలాలను విజయవంతంగా చైనా సైన్యం దక్కించుకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని