Meta: మేనేజర్‌ వ్యవస్థపై జూకర్‌బర్గ్‌ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?

ఇటీవల వేల మంది ఉద్యోగులను తొలగించిన మార్క్‌ జూకర్‌బర్గ్‌.. మరింత మందికి లేఆఫ్‌లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్‌ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈసారి వారిపై వేటు వేసే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

Updated : 31 Jan 2023 11:56 IST

వాషింగ్టన్‌: ఇటీవలే 11వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన మెటా (Meta) సంస్థ మరికొంత మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెటా సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా మెటా సంస్థల్లో మేనేజర్ల వ్యవస్థపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన సంస్థ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా వివిధ స్థాయిల్లో మేనేజర్లపై మేనేజర్లు ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మధ్యస్థాయి మేనేజర్లపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారనే కథనాలు వస్తున్నాయి.

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసారి మేనేజర్లకు పింక్‌ స్లిప్పులు ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ముఖ్యంగా మధ్యస్థాయి వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే యోచనలో మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఉన్నట్లు తెలిపింది.

మెటా సంస్థ ఇటీవలే 11వేల మందికి ఒకేసారి లేఆఫ్‌ ప్రకటించింది. 18 ఏళ్ల కంపెనీ చరిత్రలో ఈస్థాయిలో కోతలు విధించడం అదే తొలిసారి. ఇదే సమయంలో తమ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఎన్నో లేయర్లు ఉండటం వనరులు వృథా అని భావిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కోతలు తప్పవనే వార్తలు వినిపిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని