Justin Trudeau: రహస్య ప్రాంతానికి కెనడా ప్రధాని

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆయన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలే అందుకు కారణం.....

Published : 30 Jan 2022 12:35 IST

ఒట్టావా (కెనడా): కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆయన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలే అందుకు కారణం. ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భద్రతా వర్గాలు నిర్ణయించాయి. 

ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. అలాగే మాస్కులు ధరించడం, సామాజిక దూరం సహా ఇతర నిబంధనల్ని కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని ట్రక్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటించడం ఆందోళనలకు దారితీసింది. తొలి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం దీనిపై గళమెత్తింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానికి దారితీసే రహదారులన్నీ ట్రక్కు కాన్వాయ్‌లతో కిక్కిరిసి పోయాయి. ‘ఫ్రీడం కాన్వాయ్‌’ పేరిట తరలివస్తున్న ఈ ట్రక్కులన్నీ ఒట్టావాలోకి ప్రవేశిస్తే.. హింస చెలరేగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా వర్గాలు ముందు జాగ్రత్తగా ప్రధానిని రహస్య ప్రాంతానికి తరలించాయి.

మరోవైపు ఇప్పటికే కొంత మంది ఆందోళనకారులు దేశ రాజధాని నగరంలో బీభత్సం సృష్టిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్లు సహా ఇతర ఆందోళనకారులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు ట్రూడోను కించపరిచేలా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇది క్రమంగా శ్రుతి మించుతుండడమే ఇప్పుడు భద్రతా వర్గాలను కలవరపరుస్తోంది. కొందరు నిరసనకారులు ‘వార్‌ మెమోరియల్‌’ పైకి ఎక్కి నృత్యాలు చేయడం దుమారానికి దారి తీస్తోంది. ఈ చర్యను అక్కడి సైన్యాధిపతి జనరల్‌ వేన్‌ ఐర్‌, రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ తీవ్రంగా ఖండించారు. దేశం కోసం అమరులైన త్యాగాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని