Train Collision: ఘోరం.. ఎదురెదురుగా రెండు రైళ్లు ఢీకొని 36 మంది సజీవదహనం
ఎదురెదురుగా వస్తున్న కార్గో రైలు, ప్రయాణికుల రైలు వేగంగా ఢీకొనడంతో 36 మంది మృతిచెందారు. ప్రమాద (Train Collision) తీవ్రతకు కొన్ని బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
తెంపీ: గ్రీస్ (Greece)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 36 మంది సజీవ దహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. ప్రమాద (Train Collision) తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి.
సమాచారమందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రతకు ముందు బోగీల్లో మంటలు చెలరేగి 36 మంది సజీవదహనం కాగా, మరికొంతమందిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అదో కాళరాత్రి..
గ్రీస్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని అక్కడి మీడియా ఓ కాళ రాత్రిగా పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 36కి చేరగా.. 85మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రయాణికుల్లో ఎక్కువ మంది యూనివర్సిటీ విద్యార్థులే ఉన్నారు. వీరంతా వీకెండ్ హాలిడేను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు రైళ్లలో నలుగురు లోకో పైలెట్లు సహా మొత్తం ఎనిమిది మంది రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్టు గ్రీక్ రైల్ రోడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఆ సమయంలోనే దట్టమైన పొగలోనే సహాయక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. ముక్కలు ముక్కలుగా పడిఉన్న రైళ్ల శిథిలాలను బయటకు తీసి మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారిన తర్వాత రైళ్ల భాగాలను తరలించేందుకు భారీ క్రేన్‌లను తీసుకొచ్చి శిథిలాలు తొలగిస్తున్నారు. ఈ ఘటనను అత్యంత భయానకమైనదిగా గ్రీస్ ఆరోగ్యశాఖ ఉప మంత్రి తెలిపారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనా స్థలాన్ని గ్రీక్ ప్రధాని సందర్శించనున్నారు.
భయంతో వణికిపోయాం..
ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ తమకు ఎదురైన భయానక అనుభవాలను పంచుకున్నారు. తాము ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాద ధాటికి పలువురు ప్రయాణికులు రైలు కిటికీల నుంచి కిందకు పడిపోయారని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. ప్రయాణికులంతా భయంతో వణికిపోయారని వివరించారు. ప్రయాణికులు చుట్టూ చూస్తున్నారని.. ఎక్కడ ఉన్నారనే విషయం కూడా వాళ్లకు అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు, గాయపడిన వారిలో 66మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్టు గ్రీస్ ఫైర్‌ఫైటింగ్ సర్వీస్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టిన అధికారులు రైల్వే శాఖ అధికారులను విచారిస్తున్నారు. ఈ ఘటనలో స్వల్పగాయాలైన వారి వివరాలను తీసుకొని వారిని పోలీసులు బస్సుల్లో ఇళ్లకు తరలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా - జనసేన ప్రభుత్వమే: పవన్ కల్యాణ్
-
Indigo: విమానంలోనూ వృత్తి ధర్మం చాటారు.. చిన్నారి ప్రాణాలు కాపాడారు
-
Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి
-
Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు