Finland: నాటోలో చేరొద్దన్న రష్యా.. పట్టించుకోమన్న ఫిన్లాండ్‌..

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ విషయంలో రష్యా తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ దేశాలన్ని నివ్వెరపోయ్యాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయనున్నట్లు రష్యా ప్రకటించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు మారణహోమం జరుగుతూనే ఉంది.

Published : 13 May 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ విషయంలో రష్యా తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ దేశాలన్ని నివ్వెరపోయ్యాయి. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయనున్నట్టు  రష్యా ప్రకటించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు మారణహోమం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో ఎటుచూసినా శవాల గుట్టలు, ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇలా ఒకటా..రెండా చిన్న దేశమైన ఉక్రెయిన్‌ పుతిన్‌ ధాటికి అల్లాడిపోతూనే అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకనుకోకండి.. ఈ యుద్ధం వెనుక ఉన్న ప్రధాన కారణం, రష్యాకు అసలు నచ్చని చర్యకు మరో దేశం ముందడుగు వేయబోతుంది. అదే.. నాటోలో చేరడం. అవును.. ఉక్రెయిన్‌- రష్యాల యుద్ధానికి ప్రధాన కారణమైన నాటోలో చేరేందుకు మరో దేశం సిద్ధమైంది. అది ఏదో కాదు. రష్యాతో తన తూర్పు సరిహద్దును పంచుకున్న ఫిన్లాండ్‌. 

వేగంగా చర్యలు తీసుకుంటాం:
నాటో కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫిన్లాండ్‌ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి గురువారం ప్రకటించారు. ఫిన్లాండ్‌ ప్రభుత్వం ఇటీవలే జాతీయ భద్రతపై దేశ పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దీని తర్వాత ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంటుందని అంతా ఊహించిన విషయమే. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘నాటో సభ్యత్వం ఫిన్లాండ్‌ భద్రతను పటిష్ఠం చేస్తుంది. ఆలస్యం చేయకండా నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిర్ణయం పై వేగంగా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే నాటో ఫిన్లాండ్‌తో చర్చలకు ఆహ్వానిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఫిన్లాండ్‌ పొరుగున ఉన్న స్వీడన్‌ సైతం ఇదే ఆలోచనలో ఉంది.

నిర్ణయంపై రష్యా హెచ్చరిక: 
ఇరు దేశాలను ఉద్దేశించి రష్యా తాజాగా హెచ్చరించింది. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా ఇటీవల మాట్లాడుతూ.. ‘ స్వీడన్‌, ఫిన్లాండ్‌లకు బాగా తెలుసు. దీని గురించి వారు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి పూసగుచ్చినట్లు చెప్పాం’అని తెలిపిన విషయం తెలిసిందే. అయినా ఫిన్లాండ్‌ ఈ రోజు నాటోలో సభ్యత్వంపై ప్రకటన చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని