Finland: ఈసారి ఫొటో వివాదం.. తప్పేనంటూ క్షమాపణలు చెప్పిన ప్రధాని

ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శల పాలవుతున్నారు. నిన్నటివరకు ఓ వీడియోను చూపిస్తూ మారిన్‌ను తప్పుబట్టిన విపక్షాలు.. తాజాగా ఓ ఫొటోను షేర్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.......

Published : 25 Aug 2022 02:09 IST

హెల్సింకి: ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శల పాలవుతున్నారు. నిన్నటివరకు ఓ వీడియోను చూపిస్తూ మారిన్‌ను తప్పుబట్టిన విపక్షాలు.. తాజాగా ఓ ఫొటోను షేర్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. హెల్సింకిలోని ప్రధాని అధికార నివాసంలో ఇద్దరు ప్రముఖ మహిళా నేతలు పొట్టి దుస్తుల్లో అభ్యంతరకర రీతిలో ఉన్న ఫొటో అది. ఆ పార్టీ సమయంలోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని అధికార నివాసంలో ఇలాంటి పనులేంటి? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మారిన్‌ మరోసారి స్పందించారు. అయితే ఈసారి క్షమాపణలు చెప్పారు.

ఈ విషయంపై మారిన్‌ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘నా అభిప్రాయం ప్రకారం ఆ ఫొటో అభ్యంతరకరంగానే ఉంది. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి చిత్రాలు వారు దిగుండకూడదు. ఇది మినహా, ఆ పార్టీలో మరేదీ అనుచితంగా జరగలేదు’ అని వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో ఒకటి కొద్దిరోజుల క్రితం వైరల్‌గా మారింది. అందులో మారిన్‌ ఓ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ.. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అయితే, మద్యం తప్ప తాము ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదని ఆమె వెల్లడించారు.

అయినప్పటికీ అందరి అనుమానాలు నివృత్తి  చేసేందుకు మారిన్ డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. నమూనాలను పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. ప్రధాని సనా మారిన్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని