Imran khan: ర్యాలీలో కాల్పులు.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు గాయాలు

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేపట్టిన ర్యాలీలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి.

Updated : 03 Nov 2022 20:15 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌తో కొనసాగిస్తోన్న లాంగ్‌మార్చ్‌ వజీరాబాద్‌లో అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ఇమ్రాన్‌ఖాన్‌ కంటెయినర్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్‌ కంటెయినర్‌ పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు పీటీఐ నేత ఫవాద్‌ చౌధురి వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటెయినర్‌ నుంచి ఇమ్రాన్‌ను కారులోకి తరలిస్తుండగా ఆయన కుడి కాలికి బ్యాండేజీ ఉన్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్నాయి.

ఈ ఘటన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసిన వీడియోను పీటీఐ పార్టీ షేర్‌ చేసింది. అలాగే, ఈ ఘటనను ఇమ్రాన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంగా పేర్కొంది. ఈ కాల్పుల సమయంలో అక్కడే ఉన్న మరికొందరు నేతలు సైతం గాయపడ్డారు. ఇమ్రాన్‌ కంటెయినర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో ఇమ్రాన్‌ఖాన్‌ గత నెల 28న (శుక్రవారం) ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు

పీటీఐ పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌పై జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఏడుగురికి గాయాలైనట్టు పంజాబ్‌ పోలీసులు తెలిపారు.  మృతుడిని ముజ్జాం నవాజ్‌గా గుర్తించినట్టు వెల్లడించారు. ఘటనా స్థలం వద్దే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. 

ఇమ్రాన్‌పై దాడి చేయడమేంటే పాకిస్థాన్‌పై చేసినట్టే.. ఫవాద్‌

ఈ కాల్పుల ఘటనపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. షెహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఫవాద్‌ చౌధురి హెచ్చరించారు.  ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి చేయడంటమే పాకిస్థాన్‌పై దాడి చేయడమేనని పీటీఐ పార్టీ నేత ఫవాద్‌ చౌధురి అన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించిన వీడియోను పీటీఐ పార్టీ ట్విటర్‌లో విడుదల చేసింది.

వజీరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనపై పంజాబ్‌ ప్రావెన్స్‌ ముఖ్యమంత్రి పర్వేజ్‌ ఇలాహి స్పందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని త్వరలోనే శిక్షించి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. 

ఈ ఘటనను ఖండించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ 

పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌ వద్ద కాల్పుల ఘటనపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వజీరాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీ, ఐజీపీ నుంచి తక్షణమే నివేదిక కోరాలని పాక్‌ మంత్రి రాణా సనావుల్లాను ఆదేశించినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్‌ సహా గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్‌ విషయాల్లో పంజాబ్‌ ప్రభుత్వానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని షెహబాజ్‌.. తమ దేశ రాజకీయాల్లో హింసకు చోటులేదంటూ ట్వీట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని