DRC: డబ్బుల కోసం చింపాంజీల కిడ్నాప్‌.. ప్రపంచంలోనే మొదటిసారట!

డబ్బుల పేరిట చిన్నారులను కిడ్నాప్‌ చేసిన వార్తలను చూస్తుంటాం. కానీ, ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో మాత్రం మూడు చింపాంజీ(Chimpanzee)లను అపహరించడం గమనార్హం...

Published : 26 Sep 2022 02:06 IST

కిన్షాసా: డబ్బుల కోసం చిన్నారులను కిడ్నాప్‌ చేసిన వార్తలను చూస్తుంటాం. కానీ, ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో మాత్రం మూడు చింపాంజీ(Chimpanzee)లను అపహరించడం గమనార్హం. ఇలా జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారని కేంద్రం నిర్వాహకులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇటీవల ఇక్కడి లబుంబాషిలోని ఓ జంతు సంరక్షణ కేంద్రం(Sanctuary)లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. అక్కడ సంరక్షణలో ఉన్న అయిదు పిల్ల చింపాంజీల్లో మూడింటిని ఎత్తుకెళ్లారు. మిగిలిన రెండు చింపాంజీలను అనంతరం వంటగదిలో గుర్తించినట్లు కేంద్రం వ్యవస్థాపకుడు ఫ్రాంక్ చాంటెరో తెలిపారు. డబ్బుల కోసం చింపాంజీ పిల్లలను కిడ్నాప్ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని ఆయన వెల్లడించారు.

‘వాస్తవానికి.. సెలవుల్లో ఇక్కడికి రావాల్సిన మా పిల్లలను కిడ్నాప్ చేయాలని వారు తొలుత ప్లాన్ చేశారు. కానీ, పిల్లలు రాకపోవడంతో చింపాంజీలను ఎత్తుకెళ్లారు. ఆపై.. పెద్దఎత్తున డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకుంటే.. వాటికి హాని తలపెడతామని బెదిరిస్తున్నారు’ అని చాంటెరో చెప్పారు. అయితే, వారి డిమాండ్‌ నెరవేర్చడం అసాధ్యమని తేల్చేశారు. ఒకవేళ కిడ్నాపర్లకు లొంగిపోతే.. భవిష్యత్తులో మరిన్ని ఈ తరహా ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా.. ఆ జంతువులను తిరిగి ఇస్తారనే గ్యారంటీ కూడా లేదన్నారు. దేశ పర్యావరణశాఖ మంత్రికి మీడియా సలహాదారు మిచెల్ కోయక్పా సైతం ఈ ఘటనను.. అమానవీయమైనదిగా అభివర్ణించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని