Azerbaijan-Armenia clash: మరోసారి భగ్గుమన్న నాగోర్నో-కరాబాఖ్‌‌..!

అజర్‌బైజన్‌, ఆర్మేనియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. గత నెలలో కూడా ఒక సారి ఇటువంటి పరిస్థితే నెలకొంది. తాజాగా జరిగిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.

Published : 06 Mar 2023 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అజర్‌బైజన్‌-ఆర్మేనియా మధ్య నాగోర్నో-కరాబాఖ్‌ వివాదం మరోసారి భగ్గుమంది. ఆదివారం అజర్‌బైజన్‌ దళాలు, ఆర్మేనియాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోయి ఉంటారని ఇరు దేశాల నుంచి నుంచి వెలువడిన నివేదికలు వెల్లడించాయి. నాగోర్నో-కరాబాఖ్‌ వద్ద గత 30 ఏళ్లలో అజర్‌బైజన్‌-ఆర్మేనియా దేశాలు రెండుసార్లు యుద్ధానికి తెగబడిన సంగతి తెలిసిందే. 

తాజాగా జరిగిన ఘర్షణల్లో ఇద్దరు సైనికులు చనిపోయినట్లు అజర్‌బైజన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయుధాలు తీసుకెళుతున్నట్లు అనుమానిస్తున్న ఓ కాన్వాయ్‌ను తమ దళాలు అడ్డుకొన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయని పేర్కొంది. ఈ కాన్వాయ్‌ అక్రమ రహదారులను వినియోగిస్తోందని వెల్లడించింది. 
ఈ వాదనను ఆర్మేనియా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కరాబాఖ్‌ నుంచి కొందరు అధికారులు పత్రాలు, సర్వీస్‌ పిస్తోల్‌తో వస్తుండగా వారిని హత్య చేశారని పేర్కొంది. పైగా అక్రమ ఆయుధాలు తెస్తున్నారని ఆరోపించిందని పేర్కొంది. 

నగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా అజర్‌బైజన్‌లోని భాగంగా గుర్తిస్తారు. కానీ, ఆ ప్రాంతంలో అత్యధికంగా ఆర్మేనియా వాసులు ఉన్నారు. 2020లో ఈ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా-అజర్‌బైజన్‌లు దాదాపు ఆరు వారాల యుద్ధం చేసుకొన్నాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. నాటి నుంచి రష్యా శాంతిసేనలు ఇక్కడ ఉన్నాయి. ఈ యుద్ధంలో టర్కీ సరఫరాచేసిన డ్రోన్లను అజర్‌బైజన్‌ వినియోగించి ఆర్మేనియాను భారీగా దెబ్బతీసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని