ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్‌ పౌరుల ‘ది టెర్మినల్‌’ స్టోరీ!

ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం అదనపు బలగాల కోసం రష్యా నిర్బంధ సైనిక సమీకరణకు పిలుపునిచ్చింది. దీంతో కొందరు రష్యన్ పౌరులు దేశం విడిచి పారిపోతున్నారు. అలా దక్షిణ కొరియాకు వచ్చిన ఐదుగురు కొద్ది నెలలుగా విమానాశ్రయంలోనే జీవనం సాగిస్తున్నారు. 

Updated : 30 Jan 2023 11:37 IST

సియోల్‌: దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొంత మంది దేశం విడిచి వెళ్లిపోతుంటారు. అలాంటి వారిని శరణార్థులు (Refugees)గా పొరుగు దేశాలు ఆదరిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వారిని తమ దేశంలోకి అనుమతించేందుకు నిరాకరిస్తుంటాయి. ఇలాంటి కథతో కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (Steven Spielberg) ‘ది టెర్మినల్‌’ (The Terminal)అనే సినిమా తీశారు. ఇందులో టామ్‌ హాంక్స్‌ (Tom Hanks) ప్రధాన పాత్ర పోషించారు. వేరే దేశం నుంచి పారిస్‌కు వచ్చిన ఓ వ్యక్తికి దౌత్యపరమైన కారణాలతో అనుమతి నిరాకరిస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే దక్షిణ కొరియా (South Korea) రాజధాని సియోల్‌ (Seoul)లో జరిగింది. దీంతో రష్యాకు చెందిన ఐదుగురు పౌరులు గత ఐదు నెలలుగా సియోల్‌లోని ఇంచియాన్‌ విమానాశ్రయంలో ఉండిపోయారు. 

ఉక్రెయిన్‌(Ukraine) తో యుద్ధంలో రష్యా (Russia) అధిక మొత్తంలో సైనికులను కోల్పోతుండటంతో నిర్బంధ సైనిక సమీకరణకు పిలుపునిచ్చింది. దీంతో కొందరు రష్యన్‌ యువకులు దేశం విడిచి పారిపోతున్నారు. అలా గతేడాది సెప్టెంబరులో ఐదుగురు రష్యన్ పౌరులు సియోల్‌కు వచ్చారు. కేవలం నిర్బంధ సైనిక సమీకరణ వల్ల మరో దేశానికి శరణార్థులుగా రావడమనేది సరైన కారణం కాదని, దక్షిణ కొరియా న్యాయశాఖ వారికి అనుమతి నిరాకరించింది. దీంతో గత ఐదు నెలలుగా వారంతా ఇంచియాన్‌ విమానాశ్రయంలోనే గడుపుతున్నారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు వారికి ఒక పూట భోజనం అందిస్తున్నారు. మిగిలిన రెండు పూట్ల ప్రయాణికులు అందించే బ్రెడ్‌ లేదా డ్రింక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని వారి తరపు న్యాయవాది జాంగ్‌ చాన్‌ తెలిపారు. పరిమితులతో కూడిన అనుమతులతో వారు విమానాశ్రయంలో ఉండేందుకు అధికారులు అంగీకరించారు. అత్యవసర సమయంలో వారికి అవసరమైన వైద్య సాయం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం రష్యాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సుముఖంగా లేరని జాంగ్‌ చాన్‌ తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సుమారు రెండు లక్షల మంది రష్యన్లు దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు యుద్ధంలో ఉక్రెయిన్‌ గెలిచేందుకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని అమెరికా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాల చర్యలను రష్యా తప్పుబట్టింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు