నా మనవరాలు ఏం చేసిందని చంపేశారు..?

గాజా సరిహద్దులో కొద్దికాలంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య చోటుచేసుకుంటోన్న ఉద్రిక్తతలు శుక్రవారం మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Published : 07 Aug 2022 01:54 IST

గాజాసిటీ: గాజా సరిహద్దులో కొద్దికాలంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య చోటుచేసుకుంటోన్న ఉద్రిక్తతలు శుక్రవారం మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో అభం శుభం తెలియని ఓ పసి ప్రాణం గాల్లో కలిసింది. నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఐదేళ్ల అలా ఖదూమ్ మృత్యుఒడికి చేరుకుంది. ‘నా మనవరాలు నర్సరీలో చేరాలని కలలుకంది. బ్యాగ్‌, పుస్తకాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ అమాయకురాలు రాకెట్లను ప్రయోగిస్తోందా..? దాడుల్లో పాల్గొంటుందా..? ఆమె ఏం చేసిందని చంపేశారు..?’ అంటూ ఆ చిన్నారి తాతయ్య రియాద్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వం, పాలస్తీనా మిలిటెంట్లు పరస్పరం జరిపిన రాకెట్‌ దాడులతో రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. శుక్రవారం ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు.. హమాస్‌ అధీనంలోని గాజాపై భీకరంగా విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందారని, 55 మందికి పైగా గాయాల పాలయ్యారని పాలస్తీనా అధికారులు తెలిపారు. గాజా సిటీలోని ఓ అపార్టుమెంట్‌ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇస్లామిక్‌ జిహాదీ కమాండర్‌ అల్‌ జబారి చనిపోయారు. అలాగే ఆ పదిమంది మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో ఆమె తలపై గాయమైనట్లు కనిపిస్తోంది. తమ బిడ్డ చేసిన తప్పేంటని ఎవరినీ ప్రశ్నించలేక.. అలా కుటుంబం కన్నీటితో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది.

కాగా, ఈ రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్‌ లాపిడ్ స్పందించారు. గాజా సరిహద్దు వెంబటి రోజుల తరబడి ఉద్రికత్తలు కొనసాగుతున్నాయని, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌ నుంచి పొంచి ఉన్న ముప్పును నిరోధించేక్రమంలో ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందన్నారు. 2021లో మేలో 11 రోజుల పాటు గాజాపై భీకర దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుత దాడులతో ఆ పరిస్థితులు మరోసారి పునరావృతమవుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని