Death Valley: డెత్‌ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు

ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అమెరికాలో డెత్‌ వ్యాలీ (Death Valley). అటువంటి ప్రాంతంలోనూ ప్రతికూల వాతావరణ మార్పులతో ఇటీవల రికార్డుస్థాయి వర్షపాతం నమోదయ్యింది.

Published : 11 Aug 2022 01:46 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన

కాలిఫోర్నియా: ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అమెరికాలోని డెత్‌ వ్యాలీ (Death Valley). అమెరికాలోనే (America) అత్యంత పొడి ప్రదేశమిది. అటువంటి ప్రాంతంలోనూ ప్రతికూల వాతావరణ మార్పులతో ఇటీవల రికార్డుస్థాయి వర్షపాతం నమోదయ్యింది. కొన్ని గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం ఆకస్మిక వరదలకు (Flash Floods) దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో వరద బీభత్సం సృష్టించింది. అత్యంత అరుదుగా సంభవించే ఈ ఘటనతో రహదారులు కొట్టుకుపోవడంతో అక్కడి జాతీయ పార్కులో పనిచేసే సిబ్బందితోపాటు వేలాది మంది పర్యాటకులు కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు.

డెత్‌ వ్యాలీలో గతవారం 1.46 ఇంచులు (3.71 సెం.మీ) వర్షపాతం నమోదయ్యింది. ఏడాది మొత్తంలో అక్కడ కురిసే వర్షం కేవలం మూడు గంటల్లోనే కుమ్మరించింది. 1936 తర్వాత కేవలం ఒకేసారి (1988 ఏప్రిల్‌ 15న) 1.47 ఇంచులు (3.73 సెం.మీ) వర్షపాతం రికార్డు అయ్యింది. ఇటువంటి సంఘటనలు ఏడాదిలో అత్యంత అరుదుగా (ఏడాదిలో కేవలం 0.1శాతం మాత్రమే సంభవించే అవకాశం) మాత్రమే సంభవిస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. అలా కురిసిన భారీ వర్షానికి జాతీయ పార్కులోని చెట్లు నేలకూలాయి. రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, వందల సంఖ్యలో వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. పార్కులోని లగ్జరీ హోటళ్లు ధ్వంసం కావడంతో పాటు భారీగా పర్యావరణ నష్టం వాటిల్లినట్లు నేషనల్‌ పార్క్‌ అధికారులు వెల్లడించారు. ఈ వరదలతో డెత్‌ వ్యాలీ జాతీయ పార్కులో పనిచేసే 500మంది సిబ్బందితోపాటు మరో 500 మంది పర్యాటకులు గంటలపాటు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు.

భూమ్మీదనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ (Death Valley) జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది. అక్కడ గరిష్ఠంగా 128 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతలు రికార్డవుతుంటాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కూడా అక్కడి ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఇటీవల అక్కడ 107ఏళ్ల తర్వాత 130డిగ్రీల ఫారెన్‌హీట్‌ (54.4డిగ్రీ సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని