Iowa: అయోవా రాష్ట్రంలో భారీ వరదలు.. నీట మునిగిన వందల ఇళ్లు

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో వారం రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల వల్ల చాలా కౌంటీలు జలమయమయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళుతున్నారు.

Updated : 24 Jun 2024 06:32 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో వారం రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల వల్ల చాలా కౌంటీలు జలమయమయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళుతున్నారు. దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్‌ నది పొంగిపొర్లుతోంది. దీంతో సైరన్లు మోగించి, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక్కడి బావులు వినియోగయోగ్యంగా లేకపోవడంతో ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండాపోయింది. ఇక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే బాధితుల వద్దకు బోట్లు చేరుకోగలగడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో అప్రమత్తత ప్రకటించారు. సియూక్స్‌ కౌంటీ మొత్తం జలమయమైంది. ఎక్కడా వీధులు కనిపించడంలేదు. ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక సౌత్‌ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు.

రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ దాదాపు 18 అంగుళాల వర్షపాతం నమోదైంది. చాలావరకు జాతీయ రహదారులు జలమయమయ్యాయి. సియోక్స్‌ ఫాల్‌లో 7 అంగుళాల వర్షపాతం కురిసింది. ప్రస్తుతం వానలు కొంచెం తగ్గుముఖం పట్టినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు. మరోవైపు అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని చవిచూస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రిచ్‌మాండ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్, ఒహాయో, డెట్రాయిట్‌లో వేడి 32 డిగ్రీలు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని