USA: అమెరికాలో బద్దలైన డ్యామ్‌.. భారీగా వరద..!

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఓ డ్యామ్‌ బద్దలైంది. నాలుగు రాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతున్నాయి. 

Updated : 25 Jun 2024 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ఆ ప్రవాహ తీవ్రతకు ఓ డ్యామ్‌ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. అక్కడి ఐయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్‌ కౌంటీలో ది ర్యాపిడాన్‌ డ్యామ్‌ వరద తీవ్రతకు బద్దలైంది. దీంతో అక్కడి సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో డ్యామ్‌ కొంత దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదలోనే ఉంది. 

ఈ వారాంతంలో ఐయోవాలో వచ్చిన వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 11 వేల మంది జీవించే స్పెన్సర్‌ నగరం, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. 383 మందిని వరద నుంచి కాపాడారు. సియోక్స్‌ నగరానికి చెందిన ఫైర్‌ మార్షల్‌ ఈ వరదను తాము ఊహించలేకపోయినట్లు వెల్లడించారు. ఇక్కడ ఒక రైల్‌రోడ్‌ వంతెన నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది.  ఇది ఐయోవా నుంచి దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలుపుతుంది. 1993లో వచ్చిన భయానక వరదలను ప్రస్తుత పరిస్థితి గుర్తు చేస్తోందని ఐయోవా గవర్నర్‌ కిమ్‌ రేనోల్డ్స్‌ పేర్కొన్నారు. ఇక్కడ ప్రధాన వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయని, ఆస్పత్రులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. ఇక ఈ వారం మొదట్లో నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీరు మొత్తం మిస్సోరీ, మిసిస్సిప్పీ నదిలోకి చేరనుంది. 

కుండపోత వర్షాలే కారణం..

సియోక్స్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడి విమానాశ్రయంలో ఏడు అంగుళాల భారీ వర్షపాతం నమోదైంది. ఇక ఐయోవాలోని రాక్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో 11 అంగుళాల వాన పడింది. ఇటీవల కాలంలో కురిసిన విడతల వారీగా భారీ కుండపోతలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు జోసఫ్‌ అనే వాతావరణ నిపుణుడు పేర్కొన్నాడు.  ఇప్పటికే నేల పూర్తిగా తేమతో నిండిపోవడంతో భూమిలోకి నీరు ఇక ఇంకని పరిస్థితి ఏర్పడి వరదగా మారిందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని