Iowa: ఐయోవా రాష్ట్రంలో భారీ వరదలు.. నీట మునిగిన వందల ఇళ్లు..

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  

Updated : 23 Jun 2024 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA)లోని ఐయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో చాలా కౌంటీలు జలమయమయ్యాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. సమీపంలోని రాక్‌ నది పొంగిపొర్లుతోంది. ఇక్కడ చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్లు, బోట్లతో తరలిస్తున్నారు.

భారీ వర్షాలపై మేయర్‌ కెవిన్‌ మాట్లాడుతూ..  నిన్న రాత్రి గంటన్నరలో నాలుగు అంగుళాల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో విపత్తుగా గవర్నర్‌ కిమ్‌ రేనాల్డ్స్‌ ప్రకటించారు. సియూక్స్‌ కౌంటీలో ఎక్కడా వీధులు కనిపించడంలేదు.

ఇక సౌత్‌ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విషయాన్ని గవర్నర్‌ క్రిస్టిన్‌ నొయిమ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ దాదాపు 18 అంగుళాల వర్షపాతం నమోదైంది. చాలా వరకు జాతీయ రహదారులు జలమయమయ్యాయి. సియోక్స్‌ ఫాల్‌లో 7 అంగుళాల వర్షపాతం కురిసింది. ప్రస్తుతం వానలు కొంచెం తగ్గుముఖం పట్టినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొయిమ్‌ అభిప్రాయపడ్డారు. సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.

మరోవైపు అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో హీట్‌వేవ్‌ కొనసాగుతోంది. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని చవిచూస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రిచ్‌మాండ్‌, వర్జీనియా, ఫిలడేల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్‌, ఒహైయో, డెట్రాయిట్‌లో వేడి 32 డిగ్రీలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని