Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. తైవాన్‌లో భయం భయం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పలు దేశాల్లో కొత్త భయాలకు పునాదులు వేస్తోంది. అతిపెద్ద దేశాలతో సరిహద్దును పంచుకుంటూ దురాక్రమణకు గురవుతున్న......
తమ దేశాన్ని చైనా ఆక్రమిస్తుందేమోనని తైవాన్ ఆందోళన
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పలు దేశాల్లో కొత్త భయాలకు పునాదులు వేస్తోంది. అతిపెద్ద దేశాలతో సరిహద్దును పంచుకుంటూ దురాక్రమణకు గురవుతున్న చిన్న దేశాలకు ఉక్రెయిన్ పరిణామాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా నుంచి దశాబ్దాల కాలంగా పెను ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్ తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా తరహాలోనే చైనా కూడా తమపై యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటన్న చర్చ తైవాన్‌లో విస్తృతంగా జరుగుతోంది.
రష్యాకు సరిహద్దుల్లో చిన్న దేశంగా ఉక్రెయిన్ ఎలా ఉందో అదే తరహాలో చైనా సరిహద్దుల్లో తైవాన్ ఉంది. ఒకప్పుడు సొవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగం కాగా.. తైవాన్ కూడా తమ దేశంలో భాగమని డ్రాగన్ వాదిస్తోంది. ‘వన్ చైనా’ విధానాన్ని కోరుకుంటోంది. ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు ఇప్పటివరకు రష్యా ఎలాంటి చర్యలకైతే పాల్పడిందో.. తైవాన్ను హస్తగతం చేసుకునేందుకు చైనా దశాబ్దాల కాలంగా ఇదే తరహాలో పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో.. మా దేశానికి కూడా అదే పరిస్థితి ఎదురుకానుందా అన్న ప్రశ్న తైవాన్ నాయకులను కలవరపెడుతోంది. సరిహద్దు దేశాలపై రష్యా అనుసరించే దురాక్రమణ విధానాలనే డ్రాగన్ కూడా పాటిస్తుండటం వారి భయాలకు మరింత బలం చేకూరుస్తోంది.
చైనా తమ దేశంపై ఆక్రమణకు దిగితే అమెరికా అండగా నిలుస్తుందని భావిస్తూ వస్తున్న తైవాన్.. ఉక్రెయిన్ విషయంలో అగ్రరాజ్యం మిన్నకుండిపోవడం చూసి ఆందోళన చెందుతోంది. తమ విషయంలోనూ అమెరికా ప్రేక్షకపాత్ర పోషిస్తే పరిస్థితి ఏంటని కలవరపడుతోంది. చైనాకు తూర్పు తీరంలో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ ద్వీపం తొలి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అగ్రరాజ్యంతో తైవాన్‌కు ఎలాంటి సైనికపరమైన ఒప్పందాలు, సంబంధాలు లేనప్పటికీ చారిత్రక బంధాన్ని కలిగి ఉంది. ఈ బంధంతోనే మిలియన్ డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉక్రెయిన్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తైవాన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే యుద్ధ సమయంలో అమెరికా లెక్కలు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ పరిస్థితే చైనా-తైవాన్ విషయంలో పునరావృతమయ్యే అవకాశం ఉండబోదని తైవాన్‌కు చెందిన సేవా రంగ నిపుణుడు ఈథన్ లిన్ అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో తైవాన్‌పై సైనిక చర్యలకు దిగే ఆలోచన డ్రాగన్‌కు లేదని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ నిపుణుడు లి మిన్‌జియాంగ్ అంచనా వేశారు. అయితే ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు చైనా ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని మిన్జియాన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్