రష్యా ఆకృత్యాలు: చీకటి గదిలో 300 మంది నిర్బంధం.. పిట్టల్లా రాలిన ప్రాణాలు!

చెర్నిహివ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో 300 మంది పౌరులను రష్యా సైనికులు చీకటి గదిలో నిర్బంధించిన విషయం బయటపడింది.

Published : 14 Apr 2022 01:29 IST

యహిద్నే గ్రామంలో వెలుగులోకి వచ్చిన రష్యా సేనల ఆకృత్యాలు

కీవ్‌: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా సేనలు.. గత నెలన్నర రోజులుగా సృష్టిస్తోన్న ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇప్పటికే బుచాలో మారణహోమానికి పాల్పడిన పుతిన్‌ సైన్యం.. కనిపించిన ప్రతి గ్రామంలో దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చెర్నిహివ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో 300 మంది పౌరులను చీకటి గదిలో నిర్బంధించిన విషయం బయటపడింది. దాదాపు నెల రోజుల పాటు ఓ పాఠశాల బేస్‌మెంట్‌లో బంధించడంతో తీవ్ర ఒత్తిడి, సౌకర్యాల కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోయిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో ఒక్కొక్కరిగా మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ దురాక్రమణలో భాగంగా రష్యా బలగాలు చెర్నిహివ్ ప్రాంతంలోని ‘యహిద్నే’ గ్రామంలోకి మార్చి తొలివారంలో అడుగుపెట్టాయి. అనంతరం గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న రష్యా సేనలు గ్రామస్థులపై తుపాకీ ఎక్కుపెట్టి స్థానికంగా ఉన్న ఓ పాఠశాల బేస్‌మెంట్‌లో నిర్బంధించాయి. చీకటిగా ఉన్న ఆ గదిలో 300 మందిని నెలపాటు బందీలను చేశాయి. దీంతో సరైన తిండి, వసతులు లేక ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోయినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఇలా నాలుగు వారాల్లో 18 మంది మృత్యువాతపడ్డారని వాపోయారు. అంతేకాదు, చనిపోతున్న వారి ఒక్కోపేరును తరగతి గది గోడలపై రాసుకున్నట్లు వివరించారు. రష్యా బలగాలు ఆ గ్రామాన్ని వీడిపోయిన తర్వాత బయటకు వచ్చిన యహిద్నే గ్రామస్థులు.. నెలపాటు చీకటి గదిలో తాము అనుభవించిన నరకయాతను మీడియాతో పంచుకున్నారు.

‘ఈ కుర్చీపైనే కూర్చున్నా. నా కాళ్లు మొత్తం పట్టేశాయి. రాత్రి, పగలు ఆ బేస్‌మెంట్‌లోనే నిర్బంధించిన రష్యా సైనికులు కేవలం టాయిలెట్‌కు మాత్రమే బయటకు పంపించేవారు. నెలపాటు ఇలా గడపడంతో ఒక్కొక్కరి ఆరోగ్యం క్షీణించింది. నా పక్కనే కూర్చున్న వృద్ధుడు తొలుత మరణించాడు. అనంతరం అతడి భార్య ప్రాణాలు కోల్పోయింది. అటువైపు పడుకున్న మరో వ్యక్తితోపాటు అధిక బరువున్న మరో మహిళ కూడా చనిపోయారు’ అంటూ వాలంటైనా సరోయన్‌ అనే స్థానిక మహిళ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించారు. ఇలా చనిపోతున్న ఒక్కొక్కరిని స్థానిక శ్మశానంలో ఖననం చేయించారని అన్నారు. ఇలా నెలరోజుల పాటు రష్యన్‌ సైనికులు తమపై క్రూరంగా ప్రవర్తించారని యహిద్నే గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని