Srilanka fuel crisis: చమురు కొనుగోలుకు చిల్లిగవ్వ లేదు.. చేతులెత్తేసిన లంక సర్కార్‌!

శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఫిల్లింగ్‌ స్టేషన్లలో ఖాళీ బోర్డులు ధర్మనమిస్తున్నాయి.

Published : 22 Feb 2022 01:37 IST

కొలంబో: శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఫిల్లింగ్‌ స్టేషన్లలో ఖాళీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటిపోవడమే ఇందుకు కారణం. రెండు షిప్పుల్లో చమురు వచ్చినప్పటికీ వాటికి చెల్లించడానికి తగిన మొత్తం తమ వద్ద లేదని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిల సోమవారం ప్రకటించారు. గత కొన్నాళ్లుగా విదేశీ మారక నిల్వలు కొరతతో అల్లాడుతున్న శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి ఈ ప్రకటన అద్దం పడుతోంది.

విదేశాల నుంచి వచ్చే చమురు కొనుగోలు చేసేందుకు తగిన మొత్తం తమ వద్ద లేదని గత వారమే ఆ దేశ ప్రభుత్వరంగ రిఫైనరీ సంస్థ సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీ) స్పష్టంచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే డీజిల్‌ అమ్మకాలు చేపట్టడంతో ఒక్క 2021లోనే 415 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఈ సంస్థ ఎదుర్కొంది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడాలంటే చమురు రిటైల్‌ ధరలను పెంచడమొక్కటే మార్గమని మంత్రి  అభిప్రాయపడ్డారు. అలాగే చమురుపై ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించి ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తక్షణావసరాలను తీర్చుకునేందుకు మన దేశానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నుంచి 40వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోలు, డీజిలును శ్రీలంక ఫిబ్రవరి నెల మొదట్లో కొనుగోలు చేసింది. అలాగే పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లకు దాదాపు 500 మిలియన్‌ డాలర్లు రుణంగా అందించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. శ్రీలంకలో ఒక్క చమురే కాదు.. ఇతర నిత్యావర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన లంకకు.. కొవిడ్‌ రూపంలో గట్టి దెబ్బ తగిలింది. విదేశీ మారక నిల్వల కొరత ఎదుర్కోవడానికి ఇదీ ఓ కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని