China: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ మృతి

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ కన్నమూశారు. ఆయన పాలనలో చైనాకు సూపర్‌ పవర్‌ హోదా దక్కింది.

Published : 30 Nov 2022 15:38 IST

ఇటర్నెట్‌డెస్క్‌: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ (96) షాంఘైలో బుధవారం కన్నుమూశారు. లుకేమియా, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ, పార్లమెంట్‌, మంత్రివర్గం, సైన్యం జారీ చేసిన  ఓ లేఖను కూడా ప్రచురించింది. ‘‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్‌ జెమిన్‌ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదన మిగిల్చింది. జెమిన్‌ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలపై చైనా జాతీయ పతకాన్ని అవనతం చేస్తారని సీసీటీవీ పేర్కొంది.   

1989లో తియానన్మెన్‌ స్క్వేర్‌ ఘటన తర్వాత డెంగ్‌ షావోపింగ్‌ నుంచి  జెమిన్‌ అధికారం చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతింది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్‌ జెమిన్‌కే దక్కుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించడం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవడం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణమాలు ఆయన హాయంలోనే చోటు చేసుకొన్నాయి. 2002లో ఆయన పదవీ విరమణ చేసే నాటికి చైనా దాదాపు సూపర్‌పవర్‌ హోదాను అందుకొంది.

జెమిన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలకమైన షాంఘై గ్యాంగ్‌ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రాజకీయాల నుంచి వైదొలగినా పార్టీలో చాలాకాలం ఆయన వర్గం బలంగా ఉంది. షీజిన్‌పింగ్‌ అధికారం చేపట్టాక జియాంగ్‌ జెమిన్‌ వర్గాన్ని అణచివేశారనే ప్రచారం జరిగింది. చైనా కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా బిజినెస్‌ టైకూన్‌గా మారటంలో  జియాంగ్‌ జెమిన్‌ పాత్ర చాలా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని