World War II: ‘నాజీ’ క్యాంప్‌లో వేల మంది హత్య.. 97ఏళ్ల మహిళకు ఇప్పుడు శిక్ష

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (World War II) నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది యూదులు బలైపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్బంధ క్యాంప్‌లలో (Nazi Camp) ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పాత్ర ఉందంటూ.. ఓ 97ఏళ్ల మహిళను బెర్లిన్‌లోని జిల్లా కోర్టు తాజాగా దోషిగా తేల్చింది.

Published : 21 Dec 2022 01:43 IST

బెర్లిన్‌: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (World War II) హిట్లర్‌ నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది యూదులు బలైపోయిన విషయం తెలిసిందే. కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లలో (Nazi Camp) క్రూరమైన పద్ధతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వేలాది మరణాల్లో పాత్ర ఉందంటూ.. అప్పట్లో ఓ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌నకు సెక్రెటరీగా పనిచేసిన ఓ 97ఏళ్ల మహిళను బెర్లిన్‌లోని జిల్లా కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II) నాటి సుదీర్ఘమైన యుద్ధనేరాల విచారణలో దీన్ని ఒకటిగా జర్మన్‌ (German) మీడియా పేర్కొంది.

ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్‌ (Irmgard Furchner) అనే మహిళ.. 1943 నుంచి 1945 మధ్య కాలంలో స్టుతాఫ్‌ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లో పని చేశారు. అప్పట్లో ఆమె వయస్సు 18- 19 ఏళ్లు. యుద్ధ ఖైదీలతోపాటు యూదులను అక్కడ ఉంచేవారు. ప్రస్తుతం ఇది పోలాండ్‌లో ఉంది. గ్యాస్‌ ఛాంబర్లు, వ్యాధులు, ఆకలి కారణంగా అక్కడ దాదాపు 65 వేల మంది మృతి చెందారు. అయితే, స్టుతాఫ్‌ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లో 10,500 మందికి పైగా హత్యకు పరోక్షంగా సహకరించినందుకు గాను ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్‌కు ఇట్జెహోలోని జిల్లా కోర్టు రెండేళ్ల శిక్షను (Suspended Sentence) విధించింది. అప్పట్లో ఆమె మైనర్‌ కావడంతో జువెనైల్‌ చట్టాల కింద ఈ శిక్ష విధించారు. అయితే, విచారణ సమయంలో మాట్లాడిన ఫర్చ్‌నర్‌.. ఆ సమయంలో అక్కడ ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని