Benjamin Netanyahu: నెతన్యాహునే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద ముప్పు : మాజీ గూఢచారి తీవ్ర విమర్శలు

Israel–Hamas Conflict: బందీల విడుదలకు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వం అడ్డుపడుతోందని బందీల కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయినా కూడా నెతన్యాహు వైఖరిలో ఎలాంటి మార్పు ఉండటం లేదు.   

Updated : 25 Jun 2024 13:10 IST

టెల్‌అవీవ్‌: కొన్ని నెలల క్రితం తమ దేశంపై హమాస్ జరిపిన దాడితో గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ప్రధానమంత్రి నెతన్యాహు పోరాటానికి కొందరు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో దేశం తరఫున గూఢచర్యంలో పాల్గొన్న మాజీ అధికారి గొనెన్‌ బెన్‌ ఇట్జక్.. నెతన్యాహు వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఆయన ఇజ్రాయెల్‌కు ముప్పు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.(Israel-Hamas Conflict)

‘‘నేను ఎంతోమంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేశాను. ఉగ్రవాదం అంటే నాకు తెలుసు. కానీ నెతన్యాహు ఇజ్రాయెల్‌ను విధ్వంసంలోకి నెడుతున్నారని నాకు అనిపిస్తోంది. దేశానికి ఆయన అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మన దేశానికి అతిపెద్ద మద్దతుదారు. నెతన్యాహు మాత్రం ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అగ్రదేశంతో మనకున్న సుదీర్ఘ బంధాన్ని నాశనం చేస్తున్నారు’’ అని మాజీ గూఢచారి నిరసన వ్యక్తంచేశారు.

రఫాపై దాడికి సిద్ధపడొద్దని అమెరికా గత కొంతకాలంగా హెచ్చరికలు చేస్తోంది. అయినా ఇజ్రాయెల్‌ పెడచెవినపెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశం నుంచి ఆయుధాల సరఫరా తగ్గిపోయిందని నెతన్యాహు ఇటీవల వెల్లడించారు. 4 నెలల క్రితం నుంచి ఈ తగ్గుదల కనిపించిందని, కొన్నిరకాల ఆయుధాలను అగ్రరాజ్యం నిలిపివేసిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గొనెన్ ప్రస్తావించారు. ఆయన దిగిపోవాలని అంతా కోరుకుంటున్నారని, అందుకు ఈ పరిస్థితే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

ఈ స్థాయి నిరసన వ్యక్తం అవుతున్నా.. పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. హమాస్‌ అంతమయ్యేవరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని అన్నారు. పాక్షిక ఒప్పందానికి మాత్రమే తాను సానుకూలమని తెలిపారు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు వచ్చిందని.. ప్రస్తుతం తీవ్రస్థాయిలో జరగడం లేదని.. ఇక తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని