కారడవుల్లో అద్భుతం.. విమాన ప్రమాదం జరిగిన 17 రోజులకు సజీవంగా చిన్నారులు

విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత అద్భుతం చోటుచేసుకుంది. 11 నెలల పసిబిడ్డతో సహా నలుగురు చిన్నారులు దట్టమైన అడవి(Amazon rainforest)లో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?

Updated : 18 May 2023 14:27 IST

బొగొట్‌(కొలంబియా): దట్టమైన అటవీప్రాంతంలో 17 రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు బతికిబయటపడ్డారు. వారిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఇన్నిరోజుల తర్వాత వారిని సజీవంగా గుర్తించడంతో  కొలంబియా (Colombia)లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశ పరిధిలోని దట్టమైన అమెజాన్‌ అడవుల్లో(Amazon rainforest) వీరిని గుర్తించారు. దేశానికి ఇది సంతోషకరమైన రోజని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. కఠిన ప్రయాసలతో కూడిన గాలింపు చర్యల అనంతరం వారిని గుర్తించినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. 

అమెజాన్ అటవీ ప్రాంతం(Amazon rainforest) పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటిన విమానం బయలుదేరింది. అందులో పైలట్‌, ఆరుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు.‘ఆపరేషన్‌ హోప్‌’ పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో పైలట్‌, మరో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. 

అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారు అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిసింది. వారు క్షేమంగా ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్‌, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. ఎటువెళ్లాలో తెలీక వారు అక్కడక్కడే తిరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో గాలింపును మరింత తీవ్రం చేయగా.. వారి జాడ లభ్యమైంది. ప్రస్తుతం వారిని సురక్షితంగా కాపాడారు. 

అయితే వారు అడవిలో అన్ని రోజులు ఎలా సురక్షితంగా ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టతలేదు. అలాగే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. మరణించినవారిలో చిన్నారుల తల్లి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఆ ప్రాంతంలో రహదారి ప్రయాణం కష్టం కావడంతో విమాన రాకపోకలు సర్వసాధారణంగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని