Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)కు చెందిన నాలుగేళ్ల చిన్నారి  సయీద్‌ రషీద్‌ రికార్డు సృష్టించాడు. పుస్తకాన్ని రచించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు.

Published : 02 Apr 2023 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రికార్డులు సృష్టించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ బుడతడు. నాలుగేళ్ల వయస్సులోనే పుస్తకం రాసి గిన్నిస్‌ రికార్డు (Guinness World Records) నెలకొల్పాడు. యునైటెడ్‌  అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)కు చెందిన సయీద్‌ రషీద్‌ అల్మెహెరి (Saeed Rashed) అనే బాలుడు పుస్తకాన్ని రచించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రికార్డు నెల కొల్పిన నాటికి ఆ చిచ్చరపిడుగు వయస్సు 4 ఏళ్ల 218 రోజులు అని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు వెల్లడించారు.  రెండు జంతువుల మధ్య స్నేహాన్ని ప్రధాన అంశంగా తీసుకొని సయీద్‌ రాసిన ‘ ది ఎలిఫెంట్‌ సయీద్‌ అండ్‌ ది బేర్‌’ (The Elephant Saeed and the Bear) అనే పుస్తకం యూఏఈలో ఆదరణ పొందుతోంది. మార్చి 9 నాటికి 1000 కాపీలు అమ్ముడుపోవడంతో సయీద్‌ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరించారు.

కేవలం సయీద్‌ మాత్రమే కాదు.. అతడి అక్క కూడా గతంలో రికార్డు నెలకొల్పిందట. ఎనిమిదేళ్ల అల్‌ధాబి ఒకే పుస్తకాన్ని రెండు భాషల్లో రాసిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. సయీద్‌ పుస్తకం రాయడానికి ఆమే ప్రేరణ కల్పించిందట. అంతేకాకుండా అల్‌ధాబి స్థానికంగా రెయిన్‌బో చిమ్నీ ఎడ్యుకేషనల్‌ ఎయిడ్స్‌ పేరిట ఓ ప్రచురణా కేంద్రాన్ని కూడా నడిపిస్తోంది. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పిన సందర్భంగా సయీద్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ మా అక్క అంటే నాకెంతో ఇష్టం. ఆమెతో ఆడుకోవడం అంటే నాకెంతో సరదా.  ఇద్దరం కలిసి చదువుకుంటాం, రాసుకుంటాం, ఏ పని చేయాలన్నా ఇద్దరం కలిసే చేస్తాం. నేను పుస్తకం రాయడానికి ఆమే స్ఫూర్తి’’  అని  చెప్పుకొచ్చాడు. గిన్నిస్‌ రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని