france elections: మెక్రాన్‌కు పరీక్షగా ఫ్రాన్స్‌ ఎన్నికలు

ఫ్రాన్స్‌లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆదివారం తన ఓటుహక్కును వినియోగించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఈసారి అతి మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా ఉంది.

Published : 08 Jul 2024 04:09 IST

దిగువ సభ ఎన్నికల్లో పుంజుకున్న లెఫ్ట్‌ 
ఎవరికీ రాని ఆధిక్యం!

పారిస్‌: ఫ్రాన్స్‌లో జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆదివారం తన ఓటుహక్కును వినియోగించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఈసారి అతి మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా ఉంది. పార్లమెంటును ఆకస్మికంగా రద్దుచేస్తూ మెక్రాన్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 577 స్థానాలున్న శక్తిమంతమైన దిగువసభపై పట్టు సాధించేది ఎవరు, ప్రధానిగా ఎవరు ఉంటారనేది తేలనుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం అనూహ్యరీతిలో వామపక్ష కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోంది. మెక్రాన్‌ కూటమి రెండో స్థానంలో, అతి మితవాద కూటమి మూడోస్థానంలో ఉన్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు సోమవారం ఉదయానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకదశలో నేషనల్‌ ర్యాలీ పార్టీకి ఎక్కువ స్థానాలు లభిస్తాయని, అయితే ఆధిక్యానికి కావాల్సిన 289 స్థానాలను మాత్రం చేరుకోలేకపోవచ్చని భావించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో తన విధానాలతో ఏకీభవించని ప్రధానితో కలిసి అధికారాన్ని పంచుకోవాల్సిన పరిస్థితి మెక్రాన్‌కు ఎదురవుతుంది. ఏ పార్టీకీ ఆధిక్యంరాని పరిస్థితుల్లో హంగ్‌ పార్లమెంటు ఏర్పడుతుంది. ఎన్నడూలేని రీతిలో తొలి రౌండులో నేషనల్‌ ర్యాలీ పార్టీకి పెద్దసంఖ్యలో ఓట్లు లభించాయి. జాతీయ అసెంబ్లీని ఏ పార్టీ దక్కించుకుంటుంది, ప్రధాని పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేవి తేల్చడంలో ఆదివారం నాటి ఎన్నికలు కీలకం. కొన్ని దశాబ్దాల విరామం తర్వాత ఈసారి పోలింగ్‌ శాతం ఎక్కువగానే నమోదైంది. ఓటర్లు పెద్దఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటలకే దాదాపు 60% పోలింగ్‌ పూర్తయింది. 1981 తర్వాత ఈ స్థాయి స్పందన ఇదే ప్రథమం. తొలివిడతలో 67% మంది ఓట్లు వేశారు. ఫలితం ఎలాఉన్నా అధ్యక్ష పదవిలో 2027 వరకు తానే ఉంటానని, మధ్యలో గద్దె దిగేది లేదని మెక్రాన్‌ స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని