COP27: అమెరికా, చైనా.. మీ వాటా చెల్లించండి! ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

వాతావరణ మార్పులపై పేద దేశాలు పోరాడేందుకు అమెరికా, చైనా తదితర ఐరోపాయేతర సంపన్న దేశాలు తమవంతు ఆర్థిక సాయం వాటాను చెల్లించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ కోరారు. కేవలం యూరప్‌ దేశాలు మాత్రమే ఈ మేరకు చెల్లిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Published : 07 Nov 2022 16:40 IST

షర్మ్‌ ఎల్‌ షేక్‌: వాతావరణ మార్పుల(Climate Change)పై పేద దేశాలు పోరాడేందుకు అమెరికా, చైనా తదితర ఐరోపాయేతర సంపన్న దేశాలు తమవంతు ఆర్థిక సాయం వాటాను చెల్లించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ కోరారు. కేవలం యూరప్‌ దేశాలు మాత్రమే ఈ మేరకు చెల్లిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్‌ షేక్‌లో జరుగుతోన్న ఐరాస వాతావరణ శిఖరాగ్ర సదస్సు(COP27)లో భాగంగా సోమవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాలుష్య ఉద్గారాల కోత, ఆర్థిక సాయంపై.. అమెరికా, చైనాలు ముందుకు రావాలని మెక్రాన్(Emmanuel Macron) ఈ సందర్భంగా కోరారు. వాతావరణ మార్పులపై పోరాటంలో తమ వంతు వాటా చెల్లించాల్సిందిగా ఐరోపాయేతర ధనిక దేశాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు చేసే ఆర్థిక సాయంపై తీర్మానాలే.. ఈ ఏడాది సదస్సులో కీలక అజెండా. పర్యావరణహిత చర్యలు చేపట్టే విషయంలో ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రదేశాలు సాయం చేయాల్సి ఉంటుంది. గతంలో విచ్చలవిడిగా పర్యావరణాన్ని దెబ్బతీసిన అమెరికా వంటి సంపన్న దేశాలు.. ఇప్పుడు అభివృద్ధి చెందుతోన్న దేశాలకు సాయం చేయాలని భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మెక్రాన్‌ తాజా వ్యాఖ్యలతో ఈ డిమాండ్‌కు మరింత బలం చేకూరినట్లయింది. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌజ్‌ ఉద్గారాలను విడుదల చేసే చైనా తరఫున ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ సదస్సుకు గైర్హాజరవుతుండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో ఈజిప్టు చేరుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని