ఫ్రెంచ్‌ అధ్యక్షుడిని వెంటాడిన DNA చోరీ భయం.. పుతిన్‌తో భేటీలో దూరం దూరం!

రష్యా పర్యటనలో భాగంగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ను డీఎన్‌ఏ తస్కరణ భయం వెంటాడినట్లు తెలుస్తోంది.

Published : 11 Feb 2022 19:57 IST

పారిస్‌: రష్యా పర్యటనలో భాగంగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ను డీఎన్‌ఏ తస్కరణ భయం వెంటాడినట్లు తెలుస్తోంది. అందుకే కొవిడ్‌ టెస్టు చేస్తామన్న రష్యా అధికారుల అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. ఒకవేళ కొవిడ్‌ పరీక్షకు నమూనా ఇస్తే రష్యా వైద్యులు ఆయన డీఎన్‌ఏను తస్కరిస్తారనే భయంతోనే ఫ్రెంచ్‌ అధ్యక్షుడు అందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఆ దేశ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ సమయంలో 20 అడుగుల దూరంలో కూర్చొని చర్చలు జరపాల్సి వచ్చింది. అంతేకాకుండా కనీసం మర్యాదపూర్వకంగా ఇరువురు నేతలు చేతులు కూడా కలపకపోవడం గమనార్హం.

డీఎన్‌ఏ చౌర్యం భయం..

ఫ్రెంచ్‌ నేత నమూనాలను రష్యా వైద్యులు పరీక్షిస్తే ఎదురయ్యే ముప్పు ప్రస్తావనపై ఫ్రాన్స్‌ అధికార వర్గాలు స్పందించాయి. ‘పొడవైన టేబుల్‌ గురించి, హ్యాండ్‌షేక్‌ గురించి మాకు ముందే తెలుసు. కానీ, వారు మా అధ్యక్షుడి డీఎన్‌ఏను ముట్టుకోవడాన్ని మేం అంగీకరించలేం’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యం దృష్ట్యా ఆయన కఠినమైన హెల్త్‌ బబుల్‌లో ఉండాల్సిన అవసరం ఉందని రష్యా అధికారులు ముందే చెప్పారని మరో అధికారి పేర్కొన్నారు. ఇదే అంశంపై స్పందించిన మేక్రాన్‌ కార్యాలయం.. రష్యా ఆరోగ్య నిబంధనలు మాకు అనుకూలంగా కనిపించలేదని స్పష్టం చేసింది. ఇక డీఎన్‌ఏ తస్కరణ అంశం గురించి అడగ్గా.. అధ్యక్షుడి వ్యక్తిగత ఆరోగ్య నిబంధనలు అక్కడి ఆరోగ్య నియమాలకు ఆమోదయోగ్యమా, కాదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు అధ్యక్షుడికి ప్రత్యేక వైద్య బృందం ఉందంటూ సమాధానం దాటవేసింది.

అందుకే ఆ దూరం..

మరోవైపు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు కొవిడ్‌ టెస్టును నిరాకరించిన విషయాన్ని అటు క్రెమ్లిన్‌ (రష్యా అధ్యక్ష భవనం) అధికార ప్రతినిధి దిమిత్రివ్‌ పెస్కోవ్‌ కూడా ధ్రువీకరించారు. అయినప్పటికీ ఈ విషయంలో రష్యాకు ఎటువంటి ఇబ్బందీ లేదన్నారు. అయితే, అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్య రక్షణలో భాగంగానే భేటీ సమయంలో 6 మీటర్లు (20అడుగులు) దూరంలో ఉండాల్సి ఉంటుందని ముందుగానే వారికి చెప్పామన్నారు. ఇందులో రాజకీయానికి ఎటువంటి తావులేదని స్పష్టం చేశారు.

రెండు ఆప్షన్లు ఇచ్చిన రష్యా..

ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఇటీవల మాస్కోలో పర్యటించారు. ఆ సందర్భంగా ఓ పొడవైన టేబుల్‌కు చివరలో ఇరువురు నేతలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ ఫొటో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌కు ఓ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పుతిన్‌ అలా వ్యవహరించారనే విమర్శలూ వచ్చాయి. అయితే, కొవిడ్‌ టెస్టు విషయంలో మేక్రాన్‌కు రష్యా అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిసింది. అందులో ఒకటి.. పీసీఆర్‌ టెస్టు చేసేందుకు రష్యా అధికారులను అనుమతిస్తే పుతిన్‌కు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అందుకు నిరాకరిస్తే.. రష్యా అధ్యక్షుడితో భేటీ సమయంలో భౌతిక దూరంపై ఆంక్షలు ఉంటాయనేది ముందుగానే తెలియజేసినట్లు ఫ్రాన్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇలా భిన్న కారణాలతో అత్యంత దూరంగా కూర్చొని పుతిన్‌- మేక్రాన్‌ జరిపిన చర్చలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగిన మూడు రోజులకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు కాస్సీం-జోమార్ట్‌ టొకయేవ్‌ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరువురు నేతలు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడంతోపాటు సన్నిహితంగా మెలిగారు. చర్చల సమయంలోనూ ఇద్దరు నేతలు చాలా దగ్గరగా కూర్చొనే మాట్లాడుకోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని