New Research: కొక్కొరోకో కెపాసిటర్లు!

సరిగా ఉపయోగించుకోవాలేగానీ వ్యర్థాల నుంచీ మేలైన ఉత్పత్తులను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు.

Published : 14 Jun 2024 05:50 IST

చికెన్‌ కొవ్వుతో ఇంధన నిల్వ సాధనాలు

సరిగా ఉపయోగించుకోవాలేగానీ వ్యర్థాల నుంచీ మేలైన ఉత్పత్తులను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. వృథాగా పారేసే చికెన్‌ కొవ్వుతో.. విద్యుత్‌ను నిల్వ చేసే సూపర్‌ కెపాసిటర్‌లోని నెగెటివ్‌ ఎలక్ట్రోడ్‌ను అభివృద్ధి చేశారు. ఇది అద్భుత పనితీరును కనబరిచింది. ఈ పరిజ్ఞానం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. హరిత ఇంధన నిల్వ కూడా చౌకలో చేపట్టవచ్చు.


ఎందుకు? 

కాలుష్యాన్ని తగ్గించుకునే క్రమంలో పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తికి ఇటీవల ప్రాముఖ్యత పెరిగింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం.. 2022తో పోలిస్తే గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తి ఉత్పత్తి 50 శాతం మేర పెరిగింది. ఇది అనూహ్య పరిణామం.


 • ఇలా హరిత విధానాల్లో ఉత్పత్తయ్యే మిగులు విద్యుత్‌ను నిల్వ చేయగలిగితేనే ప్రపంచానికి అసలైన లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇళ్ల పైకప్పుల మీద సౌరఫలకాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల సౌరకాంతి ఎక్కువగా లభ్యమైన రోజుల్లో ఇబ్బడిముబ్బడిగా విద్యుదుత్పత్తి జరిగి, కరెంటు ధరలు భారీగా తగ్గిపోయాయి.  
 • ఈ నేపథ్యంలో హరిత విధానాల్లో ఉత్పత్తయిన విద్యుత్‌ను నిల్వచేయగలిగే కెపాసిటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం.. ప్రకృతిలో పుష్కలంగా లభ్యమవుతున్న గ్రాఫీన్‌ వంటి కర్బన పదార్థాలతో అధిక సామర్థ్యమున్న శక్తి నిల్వ సాధనాలను తయారుచేస్తున్నారు.
 • అయితే ఈ కర్బన పదార్థాలతో సూపర్‌ కెపాసిటర్‌లోని భాగాలను రూపొందించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటివల్ల హానికర గ్రీన్‌హౌస్‌ వాయువులు వెలువడతాయి. కాలుష్యానికీ అవి కారణమవుతాయి. 
 • ఈ నేపథ్యంలో చౌకలో, పర్యావరణహితంగా సూపర్‌ కెపాసిటర్లను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.

చౌకైన విధానం..

వ్యర్థాలుగా పారేసే పదార్థాలతో తక్కువ ఖర్చుతో, హరిత పద్ధతిలో సూపర్‌ కెపాసిటర్లను తయారుచేసే విధానాలను అభివృద్ధి చేయాలని దక్షిణ కొరియాలోని యూన్‌నామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ క్రమంలో వారు చికెన్‌ కొవ్వుపై దృష్టిపెట్టారు. దీన్ని విద్యుత్‌ గ్రాహక సామర్థ్యమున్న నానో నిర్మాణాలుగా మార్చేందుకు ఒక సులువైన, చౌకైన విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని సూపర్‌ కెపాసిటర్లలో వాడారు. 

 • తొలుత శాస్త్రవేత్తలు.. గ్యాస్‌ ఫ్లేమ్‌ గన్‌ జ్వాల సాయంతో చికెన్‌ నుంచి కొవ్వును సేకరించారు. 
 • ఘన రూపంలో ఉన్న ఈ కొవ్వును.. చమురు దీపంలా ఒక ఒత్తి సాయంతో మండించారు. ఈ మంటపైన ఒక ఫ్లాస్క్‌ను ఉంచారు. 
 • కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లాస్క్‌ దిగువ భాగంలో మసి పేరుకుపోయింది. దాని శాస్త్రవేత్తలు సేకరించారు. 
 • ఎలక్ట్రాన్‌ మైక్రోస్కొపీ సాయంతో పరిశీలించినప్పుడు.. ఈ మసి రేణువుల్లో కర్బన ఆధారిత నానో ఆకృతులు కనిపించాయి.
 • ఈ కర్బన నానోరేణువుల విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు థియోరియా అనే ద్రావణంలో నానబెట్టారు. 
 • ఈ నానోరేణువులతో అసెమిట్రిక్‌ సూపర్‌ కెపాసిటర్‌కు సంబంధించిన నెగెటివ్‌ ఎలక్ట్రోడ్‌ను తయారుచేశారు. ఈ సాధనంతో తయారైన సూపర్‌ కెపాసిటర్‌కు మెరుగైన ఇంధన నిల్వ సామర్థ్యం, మన్నిక, అధిక శక్తి సాంద్రత ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. 
 • శాస్త్రవేత్తలు ఊహించినట్లే థియోరియా పదార్థంలో నానబెట్టిన కర్బన నానోపదార్థాలతో తయారైన ఎలక్ట్రోడ్లలో ఈ సామర్థ్యం మరింత పెరిగింది. 
 • ఈ ఎలక్ట్రోడ్‌తో తయారైన కొత్త సూపర్‌ కెపాసిటర్‌ రోజువారీ అవసరాలను తీర్చగలదని వెల్లడైంది. ఎరుపు, పచ్చ, నీల వర్ణపు ఎల్‌ఈడీలను వెలిగించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.


విప్లవాత్మకం..

వృథాగా పోయే చికెన్‌ ఫ్యాట్‌ ఆయిల్‌ నుంచి కర్బన ఆధారిత పదార్థాలను తయారు చేయడం చాలా సులువైన, తెలివైన విధానమని శాస్త్రవేత్తలు తెలిపారు. వాణిజ్యపరమైన కెపాసిటర్లలో వినియోగానికి ఇది అనువుగా ఉంటుందన్నారు. చౌకైన, విప్లవాత్మకమైన, ఇంధన నిల్వ సాధనాల ఉత్పత్తికి మార్గం సుగమమవుతుందని చెప్పారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని