G7 Summit 2024: ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం

ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి.

Published : 16 Jun 2024 05:02 IST

ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్‌ ప్రాంతం
ఐమెక్‌ నూతన కారిడార్‌కు ప్రోత్సాహం
జి-7 శిఖరాగ్ర సదస్సు నిర్ణయం

బారీ (ఇటలీ): ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. ‘భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా’ (ఐమెక్‌) వంటివాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో ముగిసిన జి-7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. ‘‘నాణ్యమైన మౌలిక సదుపాయాలు, చక్కని పెట్టుబడుల ద్వారా ఐమెక్‌ వంటి వేర్వేరు కారిడార్లను ముందుకు తీసుకువెళ్తాం. దీంతోపాటు ఈయూ గ్లోబల్‌ గేట్వేను నిర్మిస్తాం. కృత్రిమ మేధ వ్యవస్థలను సభ్యదేశాలు పరస్పరం వాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం’’ అని కూటమి తెలిపింది. ఆసియా, పశ్చిమాసియా, పాశ్చాత్య దేశాలను సమీకృతం చేసేలా ఐమెక్‌ కింద సౌదీ అరేబియా, భారత్, అమెరికా, ఐరోపా మధ్య రహదారులు, రైల్వే, జలరవాణా వ్యవస్థను విస్తృతపరుస్తారు. చైనా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ (బీఆర్‌ఐ) ప్రభావానికి అడ్డుకట్ట వేసేలా వ్యూహాత్మకంగా దీనిని చేపట్టారు. 

ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తాం 

రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు పూర్తి బాసటగా నిలుస్తామని జి-7 ప్రకటించింది. దీర్ఘకాలం నుంచి సాగుతున్న పోరులో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు తీరేందుకు ఈ ఏడాది చివరినాటికి 5,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.17 లక్షల కోట్ల) రుణాలను సమకూరుస్తామని తెలిపింది.

మెక్రాన్‌ శ్రీ మెలోనీ  

విందులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్, ఇటలీ ప్రధాని మెలోనీ ముక్తసరిగా పలకరించుకోవడం, ఆమె మెక్రాన్‌ను సీరియస్‌గా చూడడం వైరల్‌ అవుతోంది. గర్భవిచ్ఛిత్తి హక్కుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సురక్షితమైన, చట్టబద్ధ అబార్షన్‌ అనే పదాలను తుది ప్రకటనలో ఉపయోగించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

  • జి-7 సదస్సు ముగిసినట్లు మెలోనీ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ- ఇండో పసిఫిక్‌ ప్రాంతానికి సభ్యదేశాల కట్టుబాటు అనేది చైనాకు స్పష్టమైన సంకేతమని చెప్పారు. సంప్రదింపులకు తామెప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు.
  • అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలతో మోదీ శనివారం విడివిడిగా సమావేశమయ్యారు. భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని ట్రూడో చెప్పారు. మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక రంగాల్లో బంధాన్ని విస్తరించుకోవడంపై జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిదతో మోదీ చర్చించారు. ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పురోగతి, వివిధ పెట్టుబడుల అంశాలపై సమీక్షించారు. తర్వాత మోదీ స్వదేశానికి బయల్దేరారు.

మరోసారి ‘మెలోడీ’ 

ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పురోగతిపై భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సమీక్షించుకున్నారు. మోదీకి ఆమె ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. ఐమెక్‌తో పాటు ఇతర బహుళపాక్షిక ఒప్పందాలపై వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యమైన ప్రాంతీయ, ప్రాపంచిక విషయాలపైనా వారు చర్చ జరిపారు. శుద్ధ ఇంధనం, తయారీ, అంతరిక్షం, టెలికం తదితర రంగాల్లో వాణిజ్య బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరూ స్వీయచిత్రం తీసుకున్నారు. ఆ సెల్ఫీపై ఐదు సెకెన్ల వీడియోను మెలోనీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దానిని మోదీ తిరిగి పంచుకుంటూ.. భారత్‌-ఇటలీ భాగస్వామ్యం దీర్ఘకాలం వర్థిల్లాలని ఆకాంక్షించారు. గత డిసెంబరులో కాప్‌ సదస్సులో ఇలాంటి సెల్ఫీ తీసుకుని దానికి ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా ‘మెలోడీ’ అని హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు. అప్పటి నుంచి ఈ పదం ప్రాచుర్యం పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని