G7 Summit: ఉక్రెయిన్‌కు రూ.4.17 లక్షల కోట్ల రుణం

రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి.

Published : 14 Jun 2024 05:49 IST

కీలక ప్యాకేజీకి   జీ7 దేశాల అంగీకారం
స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధుల సేకరణ

జీ7 సదస్సు వేదిక వద్దఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, బ్రిటన్‌ ప్రధాని సునాక్‌

బోర్గో ఇగ్నాజియా: రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై జీ7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా.. ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. శుక్రవారం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. ‘జీ7’లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ తాజాగా ప్రకటించారు. 

అట్టహాసంగా శిఖరాగ్ర సదస్సు ప్రారంభం 

జీ7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్టులో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తదితరులు తాజా సదస్సులో అతిథుల హోదాలో పాల్గొననున్నారు.  

నేడు పోప్‌ ప్రసంగం 

జీ7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్‌గా పోప్‌ ఫ్రాన్సిస్‌ చరిత్రకెక్కనున్నారు. కృత్రిమ మేధతో ఒనగూరే ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ముప్పుల గురించి ఆయన సదస్సులో శుక్రవారం మాట్లాడనున్నారు. గాజా, ఉక్రెయిన్‌లలో శాంతి కోసమూ పోప్‌ పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయి. 


ఇటలీకి పయనమైన మోదీ

జీ7 శిఖరాగ్ర సదస్సు అనుబంధ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడి సమావేశంలో ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), ఇంధనం, మధ్యధరా, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు ప్రయాణ ప్రారంభానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌కు కీలకమైన అంశాలపైనా సమాలోచనలు జరపనున్నట్లు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని