G7 summit 2024: ఐరోపాపై వలసల ఒత్తిడి తగ్గించాలి

ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ7 దేశాలు తీర్మానించాయి.

Published : 15 Jun 2024 05:19 IST

జీ7 సదస్సులోనేతల సమాలోచనలు 

బారీ: ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ7 దేశాలు తీర్మానించాయి. ఇందుకోసం పలు ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో పెట్టుబడులు పెంచడంపై దృష్టిపెట్టాలని నిశ్చయించాయి. ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్టులో జరుగుతున్న 50వ జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండోరోజైన శుక్రవారం కూటమి సభ్యదేశాల అధినేతలు ఈ మేరకు వలసలు, మానవ అక్రమ రవాణా కట్టడి తదితర కీలక అంశాలపై విస్తృత సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం, గాజాలో సంక్షోభం, కృత్రిమ మేధ, పర్యావరణంలో మార్పులు, చైనా పారిశ్రామిక విధానం, ఆర్థిక భద్రత సంబంధిత సమస్యలపై చర్చించారు. ‘గర్భవిచ్ఛిత్తి’ సహా కొన్ని అంశాలను ఉమ్మడి ప్రకటనలో చేర్చడంపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. 

మోదీతో జెలెన్‌స్కీ భేటీ 

ఉక్రెయిన్‌ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోసం భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దౌత్యం, చర్చలే శాంతి స్థాపనకు మార్గాలని సూచించారు. జీ7 సదస్సు వేళ ఇటలీలో మోదీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విడిగా భేటీ అయ్యారు. రష్యాతో యుద్ధంలో ప్రస్తుత పరిస్థితులను భారత ప్రధానికి ఆయన వివరించారు.  జెలెన్‌స్కీతో భేటీ చాలా ఫలవంతంగా సాగిందని ‘ఎక్స్‌’లో మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ ఉత్సాహంగా ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని