Gambia: ఇంటింటికీ తిరుగుతూ.. ఆ సిరప్‌లు వెనక్కి!

గాంబియా(Gambia)లో.. దగ్గు, జలుబు సిరప్‌(Syrup)ల వినియోగంతో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత సిరప్‌లను అత్యవసరంగా రీకాల్‌ చేసింది.

Published : 06 Oct 2022 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫ్రికా దేశమైన గాంబియా(Gambia)లో దగ్గు, జలుబు సిరప్‌(Syrup)ల వినియోగంతో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. ఈ నేపథ్యంలో గాంబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత సిరప్‌లను అత్యవసరంగా రీకాల్‌ చేసింది. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ.. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మైడెన్‌(Maiden) ఫార్మాస్యూటికల్స్‌ డైరెక్టర్‌ నరేశ్‌ కుమార్‌ గోయల్‌ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. చిన్నారుల మరణాల గురించి గురువారం ఉదయం మాత్రమే సమాచారం అందినట్లు తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో తమ ఉత్పత్తులు విక్రయించడం లేదన్నారు.

1990లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ.. సిరప్‌లను తయారు చేసి, గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంస్థకు హరియాణాలోని కుండ్లీ, పానిపట్‌లలో రెండు తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇటీవలే మరొకటి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయి పరీక్షల కోసం సంబంధిత సిరప్‌ల శాంపిళ్లను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లేబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఏదైనా తప్పు జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సైతం వెంటనే రంగంలోకి దిగినట్లు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని