Nord Stream: నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ లీకేజీ.. వాతావరణానికి ముప్పేనా..?

నార్డ్‌స్ట్రీమ్‌ (Nord Stream) గ్యాస్‌ పైపులైన్లలో లీకేజీ యూరప్‌, రష్యా మధ్య కొత్త వివాదానికి కారణంగా కనిపిస్తోంది.

Published : 29 Sep 2022 13:33 IST

లండన్‌: నార్డ్‌స్ట్రీమ్‌ (Nord Stream) గ్యాస్‌ పైపులైన్లలో లీకేజీ యూరప్‌, రష్యా మధ్య కొత్త వివాదానికి కారణంగా కనిపిస్తోంది. ఇవి తమ దేశాల్లో ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఉద్దేశించిన విద్రోహ చర్యేనని యూరప్‌ దేశాలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టాయి. మరోవైపు భారీ పేలుడు వల్లే ఇది సంభవించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాదనలేమైనా పైపులైన్ల నుంచి సహజ వాయువు భారీగా లీకైతే.. అది వాతావరణానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణానికి ముప్పు ఎందుకు..?

రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌ 1, 2 పైపులైన్లలో ఎక్కువగా మీథేన్‌ వాయువే ఉంటుంది. కార్బన్‌డైయాక్సైడ్‌ తర్వాత గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో అత్యంత తీవ్రత కలిగినది ఇదే. తాజాగా ఆ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడడం వాతావరణానికి ముప్పేనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైపులైన్లలో ఉష్ణోగ్రత, ఎంత వేగంతో లీకేజీలు అవుతున్నాయి, ఏస్థాయిలో గ్యాస్‌ నీటిలో కరిగిపోతోందనే విషయాలపై స్పష్టత లేనందున లీకేజీ ప్రభావాన్ని అంచనా వేయడం సాధ్యం కావడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో దాని పర్యవసానాలు ఏమేరకు ఉంటాయనే అంశాన్ని ఇప్పుడే అంచనా వేయలేకపోతున్నామన్నారు. ఈ లీకేజీలు భారీస్థాయిలో ఉంటే మాత్రం వాతావరణంలో వీటి ప్రభావం అత్యంత వినాశనకరంగా ఉంటుందని క్లీన్‌ఎయిర్‌ టాస్క్‌ఫోర్స్‌ కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ మేక్‌కేబ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా అది ఊహించని స్థాయిలో ఉండవచ్చన్నారు.

లీకేజీలు ఎంతకాలం ఉండొచ్చు..?

పైపులైన్లను సరిచేసేందుకు సమయం పడుతుండడంతో ఈ లీకేజీలు మరికొన్నిరోజులు లేదా వారాలు పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇదే కొనసాగితే ఆ లీకేజీ జరుగుతోన్న కిలోమీటరు వ్యాసంలో పైపులు ఉపరితలంపై తేలియాడే ప్రమాదం ఉంది. దీంతో నీటితోపాటు గాలిలోనూ ఈ ముప్పు పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సముద్ర జీవులకు మాత్రం ఈ లీకేజీల వల్ల అంతగా ప్రమాదం ఏమీ ఉండదని చెబుతున్నప్పటికీ.. గ్యాస్‌ పేరుకుపోయే ప్రాంతాల్లో మాత్రం చేపలకు ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఎంత మీథేన్‌ లీక్‌ అవుతోంది..?

ప్రస్తుతం లీకవుతోన్న నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైపులైన్లలో మొత్తం 30కోట్ల క్యుబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్గంలో గుర్తించిన లీకేజీ నుంచి గంటకు 500 మెట్రిక్‌ టన్నుల మీథేన్‌ విడుదల అవుతున్నట్లు అంచనా. ఒత్తిడి, వేగం తగ్గుతున్నా కొద్ది ఈ లీకేజీ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పైపులైన్‌ మొత్తంలో నిల్వ ఉన్న సహజవాయువు కనుక వాతావరణంలోకి ప్రవేశిస్తే.. సుమారు 2లక్షల టన్నుల మీథేన్‌ ఉద్గారాలకు ఇది దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో నార్డ్‌ స్ట్రీమ్‌ 1 పైపులైను మూతబడింది. నార్డ్‌ స్ట్రీమ్‌ 2 అసలు ప్రారంభమే కాలేదు. గ్యాస్‌ దిగుమతికి జర్మనీ నిరాకరించడమే దీనికి కారణం. రెండు పైపులైన్లలో నిండుగా గ్యాస్‌ ఉన్నా అది ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే నార్డ్‌స్ట్రీమ్‌ 2లో మూడు చోట్ల లీకేజీలు కావడంపై యూరప్‌ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని