Gavin Williamson: రిషి సునాక్‌ మంత్రివర్గంలో మొదటి రాజీనామా..

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మంత్రివర్గంలో మొదటి రాజీనామా చోటుచేసుకుంది. ఓ పార్లమెంట్‌ సభ్యుడిని బెదిరించారనే ఆరోపణలతో గవిన్ విలియమ్సన్‌ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.  

Updated : 09 Nov 2022 15:03 IST

లండన్‌: ఇటీవలి కాలంలో బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానులు, మంత్రులు వరుస రాజీనామాలు చేస్తోన్న సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కొత్తగా రిషి సునాక్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలోనూ తాజాగా ఓ మంత్రి రాజీనామా చేశారు. ఓ పార్లమెంట్‌ సభ్యుడిని బెదిరించారనే ఆరోపణలతో గవిన్ విలియమ్సన్‌ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 

తోటి పార్లమెంట్‌ సభ్యుడికి గవిన్‌ బెదిరింపులతో కూడిన టెక్ట్స్‌ మెసేజెస్‌ పంపారంటూ ఓ మీడియా సంస్థ కొద్దిరోజుల క్రితం కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఓ సీనియర్‌ సివిల్‌ సర్వెంట్‌ కూడా గవిన్‌ ప్రవర్తనపై స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సిబ్బందిని గొంతు కోసుకోవాలని, కిటికీలోంచి దూకాలంటూ బెదిరించేవాడని వ్యాఖ్యలు చేశాడు. దీంతో వీటిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దాంతో మంగళవారం రాత్రి గవిన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన లేఖను ట్విటర్‌లో పోస్టు చేసిన ఆయన తాను పంపిన టెక్ట్స్‌ మెసేజెస్‌పై క్షమాపణలు తెలియజేశారు. తాను విచారణకు సహకరిస్తానని వెల్లడించారు. గతంలో జరిగిన వాటిని వక్రీకరిస్తూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే ఈ వివాదమంతా బ్రిటన్ ప్రజలకోసం ప్రభుత్వం చేస్తోన్న మంచి పనుల్ని పక్కదోవపట్టించేలా ఉందని గుర్తించానని ఆ లేఖలో పేర్కొన్నారు. 

రెండువారాల క్రితం ప్రధాని పదవి చేపట్టిన రిషి సునాక్‌ను మొదటి నుంచే ఇలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, కాప్‌ సదస్సుకు హాజరుకానని చెప్పడం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు