Israel- Hamas: బాంబులతో దద్దరిల్లిన గాజా నగరం.. దేవుడా మాకు దిక్కెవరు?

గాజా నగరంపై ఇజ్రాయెల్‌ సేనలు ముప్పేట దాడి చేశాయి. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. స్థానికులు ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీశారు.

Updated : 08 Jul 2024 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాలో (Gaza) మరోసారి భయంకర పరిస్థితులు తలెత్తాయి. నగరంపై టెల్‌ అవీవ్‌ (Tel Aviv) దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్‌ (Hamas) ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. నగరానికి మూడువైపుల నుంచి బాంబు దాడులు.. మరోవైపు సముద్రం.. ఈ భయానక పరిస్థితుల్లో ఎటువైపు వెళ్లాలో తెలియక స్థానికులంతా రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి.. రోడ్ల పక్కనే నిద్రించారు. అక్టోబర్‌ 7 తర్వాత ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్ల్లో ఇదే అతి పెద్దదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు ఖతార్‌, అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ.. ఇంత భారీ స్థాయిలో టెల్‌ అవీవ్‌ సేనలు విరుచుకుపడటం గమనార్హం.

పక్కా ప్లాన్‌ ప్రకారం..

తాజా దాడులపై గాజా సివిల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ స్పందించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే, ఇప్పటికీ కాల్పులు కొనసాగుతుండటంతో వారి మృతదేహాలను కూడా వెలికి తీయడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ్‌, టఫాతో పాటు పశ్చిమ దిక్కున ఉన్న టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్‌ సేనలు ముందుగానే గాజా సరిహద్దులోని టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులను మోహరించాయి. ఫైటర్‌ జెట్‌లను సిద్ధం చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి. మూడువైపుల నుంచి ఒకేసారి దాడులు జరగడంతో ప్రాణభయంతో వేలాది మంది ప్రజలు మధ్యధరా సముద్రతీరం వైపు పరుగులు తీశారు. తెల్లవారు జాము వరకు కాల్పులు కొనసాగాయి.

ఎటు వెళ్లినా ప్రమాదమే!

ఈ దాడుల్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ‘‘ మూడు వైపులా శత్రువులు, ఓ వైపు సముద్రం. మేమంతా ఎక్కడికి వెళ్లాలి?ఎటు వెళ్లినా ప్రమాదమే.’’ అంటూ అక్కడి స్థానికుడొకరు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ వైపు ట్యాంకర్లు బాంబుల మోత మోగిస్తున్నాయి. మరోవైపు ఆకాశం నుంచి పిడుగులు పడినట్లుగా క్షిపణులు ఇళ్లపైనా, రోడ్లపైనా బీభత్సం సృష్టిస్తున్నాయి. మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు పక్కనే బిక్కుబిక్కు మంటూ ఉన్నాం’’ అని మరో వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, హమాస్‌ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ ప్రకటించింది. తమ బలగాలకు ముప్పు తలపెట్టే అవకాశమున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

మరోసారి సంధి ప్రయత్నాలు!

ఇటీవల ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి హమాస్‌ అంగీకరించడంతో గాజాలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై కాల్పులు ఉండబోవని ఆనందపడ్డారు. ఈ అంశంపై ఇజ్రాయెల్‌ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో ఒప్పందం ఖరారవుతుందని అంతా భావించారు. కానీ, హమాస్‌ ఇక్కడే మెలిక పెట్టింది. ఒప్పందం సంతకం చేసే ముందు ఇజ్రాయెల్‌ పూర్తిగా కాల్పులను విరమించాలని షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు నిరాకరించారు. ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్‌ యుద్ధ లక్ష్యాలను నిరోధించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. బందీల విడుదల, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అంశాలు మాత్రమే ఒప్పందంలో ఉండాలన్నారు. దీంతో అమెరికా మధ్యవర్తిత్వం ఫలవంతం కాలేదు. కాగా, అమెరికా కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్‌ విలియం బర్న్స్‌, ఖతార్‌ ప్రధాని, ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌ నిఘావిభాగం అధ్యక్షులు బుధవారం దోహాలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఇజ్రాయెల్‌-హమాస్‌ సంధి అంశంపై చర్చించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని