United Nations: స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏళ్లు!

ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏళ్లు పడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. అఫ్గానిస్థాన్‌లో మహిళలు, బాలికలను ప్రజాజీవితానికే దూరం చేసిన పరిస్థితులను ప్రస్తావించారు.

Published : 07 Mar 2023 23:45 IST

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు(Women Rights) తీవ్ర ఉల్లంఘనలకు, దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఐరాస(United Nations) ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే.. స్త్రీ, పురుష సమానత్వ(Gender Equality) సాధనకు మరో 300 ఏళ్లు పడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌(Antonio Guterres) హెచ్చరించారు.  స్త్రీ, పురుష సమానత్వ సాధనకు పనిచేస్తోన్న ‘మహిళల స్థితిగతులపై ఐరాస కమిషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుటెరస్‌ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.

‘ఉక్రెయిన్ నుంచి సాహెల్ ప్రాంతం(ఆఫ్రికా) వరకు సంక్షోభాలు, సంఘర్షణల ప్రభావం.. మొదట మహిళలు, బాలికలపైనే పడింది. పితృస్వామ్య పోకడలు మళ్లీ జడలు విప్పుతోన్న నేపథ్యంలో.. దశాబ్దాలుగా సాధించిన పురోగతి కనుమరుగవుతోంది. అఫ్గానిస్థాన్‌లో మహిళలు, బాలికలను ప్రజాజీవితానికి దూరం చేశారు. అనేక దేశాల్లో మహిళల లైంగిక, సంతానోత్పత్తి హక్కులనూ లాగేసుకుంటున్నారు. కొన్ని చోట్ల బాలికలకు కిడ్నాప్‌, వేధింపుల ముప్పు పొంచి ఉంది. మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో.. వారి విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి’ అని గుటెరస్‌ వ్యాఖ్యానించారు.

‘సాంకేతికత వినియోగంలోనూ మహిళలు వెనకే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటే.. వారిలో అధిక శాతం మహిళలే. అభివృద్ధి చెందుతోన్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం 19 శాతం మంది మహిళలు ఆన్‌లైన్‌ వినియోగిస్తున్నారు’ అని గుటెరస్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతికత, ఇంజినీరింగ్, గణిత రంగాల్లో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపారు. కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే.. స్త్రీ, పురుషుల మధ్య అధికార అంతరాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. బాలికలు, మహిళలకు విద్య, ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు.  వారికి సురక్షిత డిజిటల్ వాతావరణాన్ని అందించాలన్నారు. మరోవైపు..  డిజిటల్ వివక్ష అనేది స్త్రీ, పురుష అసమానతలకు కొత్త ముఖంగా మారిందని ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ వ్యాఖ్యానించారు. 2022లో మహిళల కంటే పురుషులు 25.9 కోట్ల మంది ఎక్కువగా ఇంటర్నెట్‌ వినియోగించినట్లు చెప్పారు. మహిళలకు నెట్టింట వేధింపులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. సాంకేతికత, ఆవిష్కరణల్లో స్త్రీ, పురుష అంతరాలను తగ్గించడంపై ఐరాస కమిషన్ ఈసారి ప్రధానంగా దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు