Updated : 25 May 2022 08:46 IST

క్వాడ్‌ది నిర్మాణాత్మక ఎజెండా

సదస్సులో ప్రధాని మోదీ  
సరికొత్త ఫెలోషిప్‌నకు సభ్యదేశాల శ్రీకారం
నౌకాదళాల మధ్య సహకారం పెంపు, పర్యావరణమార్పులపై పోరుకు సంకల్పం

టోక్యో: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చతుర్భుజ కూటమి- ‘క్వాడ్‌’ నిర్మాణాత్మక ఎజెండాతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసం, వాటి దృఢ సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులకు నూతనోత్తేజాన్నిస్తోందని పేర్కొన్నారు. మంచి కోసం పనిచేసే ఈ కూటమి మునుముందు మరింత బలోపేతమవడం ఖాయమని ఉద్ఘాటించారు. జపాన్‌ రాజధాని టోక్యోలో మంగళవారం క్వాడ్‌ సదస్సును ఉద్దేశించి మోదీ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద, ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌లతో ఆయన పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. తాజా సదస్సులో భాగంగా క్వాడ్‌ నేతలు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. సభ్యదేశాలకు చెందిన విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు కొత్త ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. తాజా చర్చల్లో బైడెన్‌, కిషిద ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి ఎక్కువగా మాట్లాడగా.. ఆ విషయాన్ని మోదీ ఏమాత్రం ప్రస్తావించలేదు. క్వాడ్‌ నేతల తదుపరి ముఖాముఖి సదస్సు ఆస్ట్రేలియాలో 2023లో జరగనుంది.

క్వాడ్‌ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వేదికపై చాలా తక్కువ సమయంలోనే క్వాడ్‌ తనకంటూ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కూటమి సభ్యదేశాలైన భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా మధ్య పరస్పర విశ్వాసం; వాటి దృఢ సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తినిస్తోంది. మన పరస్పర సహకారంతో ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత రవాణాకు మార్గం సుగమమవుతోంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ కూడా టీకాల సరఫరా, పర్యావరణ మార్పులపై పోరాటం, పటిష్ఠ సరఫరా గొలుసుల ఏర్పాటు వంటి అంశాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరునాడే సదస్సుకు అల్బనీస్‌ విచ్చేయడం.. క్వాడ్‌ పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమంటూ మోదీ కొనియాడారు.

26/11, పఠాన్‌కోట్‌ దాడులను ఖండించిన నేతలు
ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని క్వాడ్‌ నేతలు అభిప్రాయపడ్డారు. 26/11 ముంబయి దాడులు, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సహా పలు ముష్కర దాడులను వారు ముక్తకంఠంతో ఖండించారు. ఇతర దేశాలను బెదిరించేందుకు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చేందుకు అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని ఎవరూ కేంద్రంగా మార్చుకోకూడదన్న ఐరాస భద్రతామండలి తీర్మానం-2593కు తమ మద్దతును పునరుద్ఘాటించారు.

మౌలికవసతుల కల్పనకు ఉమ్మడి కృషి
ఇండో-పసిఫిక్‌ ప్రాంతం వృద్ధికి అత్యంత కీలకమైన మౌలిక వసతుల రంగంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని క్వాడ్‌ సభ్యదేశాలు తీర్మానించుకున్నాయి. ఈ రంగంలో నైపుణ్యాలు, అనుభవాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇండో-పసిఫిక్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రానున్న ఐదేళ్లలో 5 వేల కోట్ల డాలర్లకు పైగా నిధులను సమకూర్చనున్నట్లు సభ్యదేశాలు వెల్లడించాయి. క్వాడ్‌ రుణ నిర్వహణ వనరుల పోర్టల్‌ ఏర్పాటుకూ నిర్ణయించాయి.

ఆరోగ్య వ్యవస్థల పటిష్ఠతకు..
కొవిడ్‌ మహమ్మారికి ముకుతాడు వేయడంలో ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని కూటమి తీర్మానించుకుంది. అంతర్జాతీయంగా ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠపర్చేందుకు కృషిచేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. భారత్‌లో పలు టీకాల తయారీలో పురోగతిని కూటమి స్వాగతించింది.
చైనాకు హెచ్చరిక!
ఇండో-పసిఫిక్‌లో ప్రస్తుత పరిస్థితులను బలప్రయోగం ద్వారా మార్చేందుకు.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తాము ఎంతమాత్రమూ సహింపబోమని క్వాడ్‌ నేతలు ఉద్ఘాటించారు. వివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాంతీయంగా చైనా కొన్నేళ్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు- పసిఫిక్‌ ద్వీపదేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కృషిచేయనున్నట్లు క్వాడ్‌ నేతలు తెలిపారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం అంతర్జాతీయ సమస్య: బైడెన్‌

బైడెన్‌ తాజా చర్చల్లో కొవిడ్‌ మహమ్మారి, సరఫరా గొలుసుల వంటి అంశాలను కూడా ప్రస్తావించినప్పటికీ.. ఉక్రెయిన్‌ సంక్షోభం గురించే ఎక్కువగా మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా పాశవిక యుద్ధం ఘోర విపత్తుకు కారణమవుతోంది. అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కేవలం ఐరోపాకు సంబంధించిన అంశమేమీ కాదు. అది అంతర్జాతీయ సమస్య. నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రస్తుతం సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం లేదు. సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ప్రతి పాఠశాల, ప్రతి సంస్కృతి, ప్రతి చారిత్రక మ్యూజియంను ధ్వంసం చేస్తున్నారు. రష్యా ఈ యుద్ధాన్ని కొనసాగించినంతకాలం.. దాన్ని నిలువరించేందుకు మా భాగస్వామ్య దేశాలతో కలిసి కృషిచేస్తూనే ఉంటాం’’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. చేతల కూటమిగా క్వాడ్‌ను అభివర్ణించారు. సదస్సులో మోదీకి స్వాగతం పలుకుతూ.. ‘మిమ్మల్ని మళ్లీ నేరుగా కలుసుకోవడం అద్భుతంగా ఉంది’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత రవాణాకు క్వాడ్‌ నేతలు కట్టుబడి ఉండటం అత్యంత ముఖ్యమని కిషిద పేర్కొన్నారు.


శాంతి పరిరక్షణకు ఐపీఎండీఏ

ఇండో-పసిఫిక్‌ జలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా సభ్యదేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకుగాను కొత్తగా ‘ఇండో-పసిఫిక్‌ నౌకాదళరంగ అవగాహన (ఐపీఎండీఏ)’ కార్యక్రమానికి క్వాడ్‌ శ్రీకారం చుట్టింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు ఇది దోహదపడనుంది.  ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో విపత్తులను కలిసికట్టుగా, మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకుగాను ‘మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలపై క్వాడ్‌ భాగస్వామ్యం (హెచ్‌ఏడీఆర్‌)’ ఏర్పాటును కూడా తాజాగా ప్రకటించారు.
* మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులపై ఉమ్మడిగా పోరాడేందుకు ‘క్వాడ్‌ పర్యావరణ మార్పుల సర్దుబాటు, తగ్గింపు ప్యాకేజీ (క్యూ-ఛాంప్‌)’ కార్యక్రమాన్ని తాజాగా ప్రకటించారు.  
* సభ్యదేశాల భవిష్యత్తుతరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా సరికొత్త ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నట్లు క్వాడ్‌ ప్రకటించింది. దీనికింద ఏటా ఒక్కో సభ్యదేశం నుంచి 25 మంది చొప్పున మొత్తం 100 మంది * *  విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, గణిత (స్టెమ్‌) విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌, డాక్టోరల్‌ డిగ్రీలు చదివేందుకు ఉపకార వేతనాలు అందించనున్నారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని