Bone Fracture: బాల్యంలో ఎముకలు విరిగితే.. మళ్లీ మళ్లీ విరిగే ముప్పు

చిన్నతనంలో ఎప్పుడైనా కోతికొమ్మచ్చి ఆడినప్పుడో, లేదా గోడలు దూకినప్పుడో ఎముకలు విరిగాయా? అలా జరిగితే పెద్దయిన తర్వాతా మళ్లీమళ్లీ ఎముకలు విరిగేందుకు, ఆస్టియోపోరోసిస్‌ (బోలు ఎముకల వ్యాధి) రావడానికి అవకాశం ఉంటుందని తాజాగా తేలింది.

Updated : 19 Dec 2022 10:14 IST

డ్యునెడిన్‌: చిన్నతనంలో ఎప్పుడైనా కోతికొమ్మచ్చి ఆడినప్పుడో, లేదా గోడలు దూకినప్పుడో ఎముకలు విరిగాయా? అలా జరిగితే పెద్దయిన తర్వాతా మళ్లీమళ్లీ ఎముకలు విరిగేందుకు, ఆస్టియోపోరోసిస్‌ (బోలు ఎముకల వ్యాధి) రావడానికి అవకాశం ఉంటుందని తాజాగా తేలింది. న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌లో అయిదు దశాబ్దాల పాటు పలువురు మధ్యవయసు వారిపై చేసిన పరిశోధనల వివరాలను ఇప్పుడు వెల్లడించారు.

1972 ఏప్రిల్‌ నుంచి 1973 మార్చి వరకు ఒటెపోటి డ్యునెడిన్‌ ఆస్పత్రిలో పుట్టిన వెయ్యి మందిని తీసుకుని వారి ఆరోగ్యాన్ని ఇటీవలి వరకు పరిశీలించారు. క్రీడల్లో వారి భాగస్వామ్యం, శారీరక హింస, ముప్పును ఎదుర్కొనే ప్రవర్తన.. ఇలా పలు అంశాలను క్షుణ్నంగా గమనించారు. బాల్యంలో ఒకసారి ఎముకలు విరిగిన వారికి పెద్దయిన తర్వాత మళ్లీ విరిగే అవకాశం రెట్టింపు అయ్యిందని, మహిళల్లో తుంటి ఎముక సాంద్రత తగ్గుతోందని చెప్పారు.

జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో ఎముకల ఆరోగ్యం బాగుండటంతో పాటు ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ముప్పు సైతం కొంత తగ్గుతోందన్నారు. పిల్లల్లో సగం మందికి కనీసం ఒకసారి, నాలుగోవంతు బాలురకు, బాలికల్లో 15% మందికి పలుమార్లు ఎముకలు విరుగుతాయి. కొందరికి మాత్రం బాల్యంలోనే పదేపదే కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే అలవాటు ఉంటుంది. పేద కుటుంబాల వారు, శారీరకశ్రమ ఎక్కువ చేసేవారు, అధిక శరీర బరువు ఉన్నవారు, విటమిన్‌ డి తక్కువగా ఉండేవారితో పాటు.. శారీరకంగా హింసకు గురయ్యేవారికి ఇలా విరిగే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయని తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని