అమెరికాను వీడని మంచు తుపాను

మంచు తుపాను ధాటికి అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర్రంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 27 మంది మృతిచెందారు.

Updated : 27 Dec 2022 04:57 IST

48కి చేరిన మృతుల సంఖ్య

జపాన్‌లోనూ 17 మంది మృతి

బఫెలో, టోక్యో: మంచు తుపాను ధాటికి అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర్రంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 27 మంది మృతిచెందారు. దీంతో అమెరికాలో సోమవారం ఉదయం నాటికి మంచు తుపాను బారిన పడి మరణించిన వారి సంఖ్య 48కి చేరింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న బఫెలో నగరంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని స్థానిక అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఇక్కడి నయాగ్రా విమానాశ్రయం ప్రాంతంలో 109 సెం.మీ. మంచు కురవడంతో మంగళవారం ఉదయం వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల మంచు కింద ఇరుక్కుపోయిన ఇళ్లలో, కార్లలో చాలామంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొన్నిచోట్ల కార్లు మంచు కింద ఆరు అడుగుల లోతులో కూరుకుపోయాయి. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం 2400 విమానాలు రద్దయ్యాయని ఫ్లైట్‌అవేర్‌ సంస్థ తెలిపింది. తూర్పు అమెరికాలోనూ చలి తీవ్రంగా ఉంది. క్రిస్మస్‌ పండగ రోజు దాదాపు 2 లక్షలకుపైగా ఇళ్లకు కరెంటు లేకుండా పోయింది. అట్లాంటా, షికాగో, డెన్వర్‌, డెట్రాయిట్‌లలో ప్రయాణికుల కష్టాలు కొనసాగాయి. మరోవైపు పొరుగు దేశమైన కెనడాలోనూ మంచు తుపాను ప్రభావం చూపెడుతోంది. ఒంటారియో, క్యూబెక్‌లలో లక్షల మంది విద్యుత్‌ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన నగరాల్లో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. టొరంటో- ఒట్టావాల మధ్య రైలు సేవలు నిలిపేశారు. ఇక్కడి బ్రిటిష్‌ కొలంబియాలో మంచు రోడ్డుపై బస్సు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు.  

జపాన్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

జపాన్‌లో భారీగా కురుస్తున్న మంచు ధాటికి 17 మంది మరణించారు. 90 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. గత వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నా..వారాంతానికి మంచు కురవడం పెరిగిందని విపత్తు నిర్వహణ అధికారులు సోమవారం తెలిపారు. జపాన్‌ ఉత్తర ప్రాంతాలపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడి రహదారులపై వందల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని