అమెరికాలో హిమపాతం.. ఐరోపాలో వేసవి తాపం!

అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు కప్పేయటం చూశాం.

Updated : 05 Jan 2023 09:06 IST

భిన్నమైన శీతాకాలం

అనూహ్య వాతావరణ మార్పులకు భూగోళం ఆలవాలం అవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కొద్దిరోజుల కిందటే అమెరికాను మంచు కప్పేయటం చూశాం. అసాధారణ హిమపాతంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు, జనజీవనం అల్లాడటం చూశాం. వారం రోజుల్లోనే ఐరోపా వేదికగా మరో అసాధారణ ప్రకృతి పరిణామం ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. గడ్డ కట్టాల్సిన చోట, మంచు పేరుకుపోవాల్సిన చోట ఈ సారి ఆ ఊసే మాయమైంది. వాతావరణం ఎండాకాలంలా వేడిని తలపిస్తోంది.

* జనవరి 1 వచ్చిందంటే.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు ఆల్ప్స్‌ పర్వతశ్రేణులకు చేరుకుంటారు. పర్వతాలపై పేరుకుపోయిన మంచులో స్కీయింగ్‌ చేయటానికని వస్తారంతా. ఈ సారీ అలాగే ఆశగా వచ్చారు. తీరా చూస్తే ఆ పర్వత శ్రేణుల్లో మంచు మాయమైంది. చివరకు స్కీయింగ్‌ నిర్వాహకులు కృత్రిమంగా మంచు పరచి అరకొర వినోదంతో సర్దుకుపొమ్మంటున్నారు. మామూలుగానైతే ఈ సమయానికి ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల దరిదాపుల్లోకి, అంతకంటే తక్కువకు చేరుకుంటాయి. అనేక దేశాలపై మంచు దుప్పటి కప్పేస్తుంది. అలాంటిది ఐరోపాలోని అనేక దేశాల్లో ఈసారి వందేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ ఉష్ణోగ్రతలను చూసి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* ఈ నెల మొదటివారం పోలండ్‌లో 18.9, స్పెయిన్‌లో 25.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయి ఉష్ణోగ్రత మామూలుగా వేసవిలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్‌, లిథువేనియా, లాత్వియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, బెలారస్‌ల్లోనూ ఉష్ణోగ్రత వందేళ్లలో ఎన్నడూ ఈ సమయంలో ఇంత ఎక్కువగా నమోదు  కాలేదంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌, ఉక్రెయిన్‌లలోనూ ఇదే పరిస్థితి. పోలండ్‌లోని వార్సాలో గత నెల కంటే 4 డిగ్రీలు ఎక్కువ నమోదు కాగా, స్పెయిన్‌లో ఎండాకాలాన్ని తలపిస్తోంది. స్కీయింగ్‌ పండగకు నెలవైన స్విట్జర్లాండ్‌లో 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పర్యాటకులకు నిరుత్సాహం కలిగిస్తోంది. 2023లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండబోతాయనటానికి ఇది నిదర్శనమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగని ఐరోపా అంతటా ఇలాంటి పరిస్థితి లేదు. రష్యా వైపు మాత్రం ఈ వారాంతంలో మైనస్‌కు చేరే అవకాశం ఉంది. హీట్‌డోమ్‌ కారణంగానే ఈ అసాధారణ మార్పులని శాస్త్రవేత్తలంటున్నారు.

ఏమిటీ హీట్‌డోమ్‌?

గిన్నె మూతపై వేడి ఆవిరి పేరుకున్నట్లుగా.. ఏదైనా ప్రాంత వాతావరణ ఉపరితలంలో అధిక పీడనం వల్ల వేడిగాలి పేరుకుపోవటంతో హీట్‌డోమ్‌ ఏర్పడుతుంది.  2021లో కెనడా, అమెరికాల్లో ఈ హీట్‌డోమ్‌ కారణంగా విపరీతమైన వేడిగాలులు వీచి.. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకొని చాలామంది మరణించారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని